మాజీ ఎమ్మెల్యే కిలివేటిని అడ్డగించి దాడులకు పాల్పడిన పోలీసులు
నాయుడుపేట టౌన్: నాయుడుపేట మున్సిపల్ ఎన్నికల్లో మంగళవారం కౌంటింగ్ సందర్భంగా అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన కొందరు అభ్యర్థులను రీకౌంటింగ్ పేరుతో లేనిపోని తప్పులు చూపి ఓడినట్టుగా ప్రకటించారు. ఈ విషయమై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పోలింగ్ ఏజెంట్, అభ్యర్థులతో కలిసి మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కౌంటింగ్ హాల్ వద్దకు వెళుతుండగా సీఐ వెంకటరమణతో కలిసి పోలీసులు అడ్డుకున్నారు. ఆపై సంజీవయ్యపై మూకుమ్మడిగా దాడులకు తెగబడ్డారు. సంజీవయ్యతో పాటు మహిళా అభ్యర్థులపై కూడా పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. అదే సమయంలో అక్కడి చేరుకున్న నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు, పలువురు సీఐలు సంజీవయ్యను బలవంతంగా పోలీసు జీపులో ఎక్కించుకొని స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత కౌంటింగ్ కేంద్రం సమీపంలో పోలీసులు భయానక వాతావరణాన్ని సృష్టించారు. అక్కడున్న వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై లాఠీచార్జ్ చేసి దుర్మార్గంగా వ్యవహరించారు.
గెలిచినా ఓడినట్టేనా?
నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డుకు చెందిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని సుగుటూరు మాధవి 3 ఓట్లగెలిచినట్టు మొదల ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఆపై కూటమి నేతలు అధికారులపై ఒత్తిడి పెంచి రీకౌంటింగ్ పేరుతో ఆరు ఓట్ల తేడాతో ఓడినట్టు మరోసారి ప్రకటించారు. 2వ వార్డులో వైఎస్సార్ సీపీకి 375 ఓట్లు, టీడీపీకి 372 ఓట్లు పోలయ్యాయి. అంతలోనే అధికార పార్టీ నేతలు అధికారులపై ఒత్తిడి పెంచి వైఎస్సార్ సీపీకి చెందిన 9 ఓట్లు చెల్లవని ప్రకటించారు. అనంతరం ఆమె మీడియాతో తన ఆవేదనను వ్యక్తం చేశారు. అటు పోలీసులు, ఇటు ఎన్నికల అధికారులు కూడా దారణంగా వ్యవహరించారని బోరున విలపించారు. అదేవిధంగా 17వ వార్డుకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినిని కూడా రీకౌంటింగ్ పేరుతో ఓడించాలని కుయుక్తులు పన్నారు. అయితే షఫీర్ గట్టిగా పట్టుపట్టడంతో రీకౌంటింగ్‌లో కూడా షఫీర్ 11ఓట్ల మెజారీటీతో విజయం సాధించారు.


