తిరుపతి అన్నమయ్యసర్కిల్:మురసు తుపాను కారణంగా రైల్వేశాఖ రెండు రైళ్లను దారి మళ్లించింది. ఈ మేరకు రైల్వే అధికారయంత్రాంగం పత్రికా ప్రకటన విడుదల చేసింది. రైలు నం.12625 తిరువనంతపురం – న్యూఢిల్లీ (టీవీసీ–ఎన్డీఎల్ఎస్) ఈ నెల 2న బయలుదేరిన ఈ రైలును రేణిగుంట –యరగ్రుంట్ల – న్యూఢిల్లీ – గుంటూరు – విజయవాడ మార్గంలో దారి మళ్లించారు. అదేవిధంగా రైలు నం.18638 (ఎస్ఎంవీబీ–హెచ్‌టీఈ) ఈనెల 3న బయలుదేరిన ఈ రైలును కూడా రేణిగుంట – యరగ్రుంట్ల – న్యూఢిల్లీ – గుంటూరు – విజయవాడ మార్గంలో దారి మళ్లించారు. కాగా ఈ రెండు రైళ్లు సాధారణంగా ప్రయాణించే రేణిగుంట – గూడూరు – విజయవాడ మార్గాన్ని రద్దు చేశారు.
ఓట్ల లెక్కింపు కేంద్రం పరిశీలన
నాయుడుపేటటౌన్: నాయుడుపేట పట్టణంలో జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో జరిగిన ఓట్లు లెక్కింపు కేంద్రాన్ని కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎస్పీ ఎల్.సుబ్బారాయుడు పరిశీలించారు. కలెక్టర్ నేరుగా ఓట్లు లెక్కింపు కేంద్రంలో పర్యటించి పోస్టల్ లెక్కింపును పరిశీలించారు. ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా కౌంటింగ్ కేంద్రంలో తగిన భద్రతా చర్యలు చేపట్టాలని రిటర్నింగ్ అధికారి షేక్ ఫజులుల్లాను ఆదేశించారు. ఎస్పీ సుబ్బారాయుడు కూడా కౌటింగ్ కేంద్రానికి చేరుకొని కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించారు. డీఎస్సీ చెంచుబాబు, నాయుడుపేట తహసీల్దార్ చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.
శ్రీవారి దర్శనానికి 8 గంటలు
తిరుమల: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 14 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సోమవారం అర్ధరాత్రి వరకు 67,300 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 22,380 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.04 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 8 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది.


