వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను అడ్డుకున్న టీడీపీ గూండాలు
శ్రీకాళహస్తి, పెళ్లకూరు, రైల్వేకోడూరులో అరాచకం
ముగిసిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల పర్వం
సాక్షి ప్రతినిధి తిరుపతి: జిల్లాలో జెడ్పీపీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల పర్వం శుక్రవారం ముగిసింది. చివరి రోజూ టీడీపీ గూండాల అరాచకమే రాజ్యమేలింది. నామినేషన్ల కేంద్రాల వద్ద యుద్ధవాతవరణం నెలకొంది. ప్రధానంగా శ్రీకాళహస్తి మండ లం ముచ్చువోలు, చల్లపాళెం, కాపుగున్నేరి, అక్కుర్తి, బీవీపురం, అమ్మపాళెం ఎగువవీధి, ఓబులాయపల్లి, గోవిందరాజపల్లి, గుంటకిందపల్లి, కళవగుంట, వాగివీడు, వేడం ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు వేసేందుకు కేంద్రాలకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను టీడీపీ గూండాలు అడ్డుకున్నారు. పోలీసుల సహకారంతో నామినేషన్ పత్రాలు లాక్కొని చించివేసి, దాడులకు తెగబడ్డారు. ఏర్పేడు మండలం, పాపానాయుడుపేట, మర్రిమంద, ముసిలిపేడు, కోబాక, పాతవీరాపురం, పంగూరు ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ వేసేందుకు ప్రయత్నించిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై దాడికి యత్నించారు. నామినేషన్ వేయనీయకుండా వెనక్కి తరిమేశారు. సూళ్లూరుపేట నియోజకవర్గం, పెళ్లకూరు మండలం, తాల్వాయిపాడు, చిల్లకూరు, రోషనూరు, పునబాక, చావలి, శిరసనంబేడు, పెళ్లకూరు ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ వేయనీయకుండా టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. అంతటితో ఆగని టీడీపీ మూకలు వైఎస్సార్‌సీపీ కండువాలతో లోనికి వెళ్లి నామినేషన్లు వేశారు. ఆ స్థానాలను ఏకగ్రీవం చేసుకునేందుకు కుట్రలు, దాడులకు తెగబడ్డారు. సూళ్లూరుపేట మండలంలోని మంగానెల్లూరు, మంగళంపాడు, ఇరుపూరు, ఆబాక, మన్నేముత్తేరి, కేసీఎంగుంట, కడపట్రా ఎంపీటీసీ స్థానాలలో అదే పరిస్థితి నెలకొంది. రైల్వేకోడూరు నియోజకవర్గంలోని ఓబులవారిపల్లె మండలానికి చెందిన గాదెల, ఓబులవారిపల్లె–1, పెనగలూరు మండలంలోని కట్టావారిపల్లె ఎంపీటీసీ స్థానాలకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను టీడీపీ గూండాలు అడ్డుకున్నారు.
చంద్రగిరిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్ వేయనీయకుండా దాడులు చేసేందుకు సిద్ధంగా ఉన్న టీడీపీ గూండాలు
రేపు నామినేషన్ల పరిశీలన
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా గత మూడు రోజులుగా దాఖలైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన పక్రియ శనివారం కొనసాగనుంది. 25న తిరస్కరించిన నామినేషన్ల అప్పీల్, 26న అప్పిలేట్ అథారిటీ వద్ద అప్పీళ్ల పరిష్కారం, 27 మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంవహరణ, అదే రోజు సాయంత్రం అభ్యర్థుల తుది జాబితా వెల్లడికానుంది.
మూడో రోజూ పచ్చ మూకల అడ్డగింపు
జిల్లాలో నారావారి రక్త చరిత్రను టీడీపీ గూండాలు కొనసాగిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అద్దె రౌడీలను దించి అరాచకం సృష్టిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ తరఫున నామినేషన్లు పడకుండా రాక్షస కాండకు దిగుతున్నారు. చివరి రోజైన శుక్రవారం శ్రీకాళహస్తి, పెళ్లకూరు, రైల్వేకోడూరులో మరింత బరితెగించేశారు. అభ్యర్థుల చేతుల్లోని నామినేషన్ పత్రాలను లాక్కుని చించివేశారు. అంతటితో ఆగకుండా దాడులకు తెగబడ్డారు. ఖాకీ.. ఖద్దరు కలిసి స్థానికులను సైతం భయాందోళనకు గురిచేశారు.
జిల్లాలో 444 ఎంపీటీసీలకు గాను 408 చోట్ల మాత్రమే వైఎస్సార్‌సీపీ తరఫున అభ్యర్థులు నామినేషన్లు వేశారు. 36 చోట్ల నామినేషన్లు వేయనీయకుండా టీడీపీ నేతలు అడ్డుకున్నారు. 35 మండలాల పరిధిలోని 35 జెడ్పీటీసీలకు అన్ని ప్రధాన పార్టీలకు చెందిన వారు నామినేషన్లు దాఖలు చేశారు.
సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తూ నోటీసులు జారీ చేశారు. వాకాడు మండలంలో కొండాపురం సెగ్మెంట్ నుంచి దాన శ్రీనివాసులు తొలి నామినేషన్ వేశారు. ఆ తర్వాత మిగిలిన వారు నామినేషన్లు దాఖలు చేశారు.
నాయుడుపేట అర్బన్‌న్ పరిధిలో కాపులూరు ఎంపీటీసీ స్థానికి వైఎస్సార్‌సీపీకి చెందిన నేత నామినేషన్‌న్ వేయడానికి వెళితే టీడీపీ నేతలు పత్రాలను లాక్కువెళ్లడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో అర్బన ఎస్‌ఐ శివశంకర్ టీడీపీ నేతలను అడ్డుకున్నారు. టీడీపీ నేతలు పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఆ ఎస్‌ఐని వీఆర్‌కు బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది.
తిరుపతి రూరల్ ఎంపీడీవో కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున టీడీపీ నేతలు గుమికూడి వైఎస్సార్‌సీపీకి చెందిన వారి నామినేషన్లు చించివేయడానికి సిద్ధమయ్యారు. అయితే పోలీస్ ఉన్నతాధికారులు వస్తున్నట్లు సమాచారం రావడంతో స్థానిక పోలీసులు అందర్నీ వెళ్లగొట్టారు.
చంద్రగిరిలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడానికి వందలాది మంది కూటమి రౌడీలు, గంజాయి బ్యాచ్ తిష్టవేసింది. అయితే కలెక్టర్‌తోపాటు ఎస్పీ ఆ ప్రాంతానికి వస్తున్న తరుణంలో అడిషనల్ ఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.


