పోలీసుల సాక్షిగా.. పాకాలలో బలవంతపు విత్‌డ్రాలు | - | Sakshi
Sakshi News home page

పోలీసుల సాక్షిగా.. పాకాలలో బలవంతపు విత్‌డ్రాలు

Oct 24 2026 9:50 AM | Updated on Oct 24 2026 9:50 AM

● వైఎస్సార్‌సీపీ అభ్యర్థులచేత సంతకాల సేకరణ

సాక్షి, టాస్క్‌ఫోర్స్‌: పోలీసుల సాక్షిగా పాకాల మండలంలో వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ వ్యవహారం తీవ్ర వివాదాస్పదంగా మారింది. వైఎస్సార్‌సీపీ తరఫున నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులను నామినేషనన్‌ కేంద్రం బయట అడ్డగించి, బలవంతంగా విత్‌ డ్రా పత్రాలపై సంతకాలు చేయించుకోవడం కలకలం రేపాయి. పోలీసుల సమక్షంలోనే ఈ వ్యవహారం సాగినా తమకు రక్షణ కల్పించలేదని బాధిత అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

పోలీసులకు ఫిర్యాదు

వైఎస్సార్‌సీపీ తరఫున నామినేషన్లు వేసిన దళిత అభ్యర్థులపై దాడి చేయడం అమానుషమని బాధిత ఎంపీటీసీ అభ్యర్థులు వాపోయారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు చంద్రగిరి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగా.. వారు నేరుగా ఫిర్యాదు స్వీకరించలేదు. దీంతో ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశారు. టీడీపీ గూండాలపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. హైకోర్టును ఆశ్రయించనున్నట్టు బాధితులు తెలిపారు.

నామినేషన్‌ కేంద్రం లోపల వరకే నా బాధ్యత

వైఎస్సార్సీపీ అభ్యర్థులు నామినేషన్‌ వేయించాలని కోరడంతో నామినేషన్‌ కేంద్రం లోపల వరకు తీసుకువెళ్లి వదలడమే తన బాధ్యతని, ఆ తరువాత ఏం జరిగినా తనకు సంబంధం లేదన్నట్టుగా పాకాల సీఐ చిన్నగోవిందు తమతో అన్నట్టు అభ్యర్థులు వెల్లడించారు. టీడీపీ గూండాల నుంచి తమను కాపాడాలని అక్కడే ఉన్న సీఐను ప్రాధేయపడగా ఆయన అలా సమాధానం ఇచ్చారన్నారు. అంతేకాక వైఎస్సార్సీపీ అభ్యర్థుల నుంచి విత్‌డ్రా పత్రాలపై ఎలాగైనా సంతకాలు తీసుకోవాలని టీడీపీకి చెందిన వ్యక్తులను సదరు సీఐ పురమాయించినట్టు స్పష్టం చేశారు.

ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు

‘మేము నామినేషన్లు వేసి వస్తుంటే కేంద్రం వద్ద టీడీపీ గూండాలు, గంజాయి బ్యాచ్‌ మకాం వేశారు. విత్‌డ్రా ఫారాలపై సంతకాలు చేయాలంటూ మాపై దాడికి యత్నించారు. ప్రాణభయంతో మేము సంతకాలు చేశాము. మా ఇష్టపూర్వకంగా సంతకాలు చేసినవి కావు. వాటిని పరిగణనలోకి తీసుకోవద్దు. మా నామినేషన్లు చెల్లుబాటయ్యేలా చర్యలు తీసుకోండి’ అంటూ చంద్రగిరి నియోజకవర్గంలోని పలువురు వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థులు ఇందులో గణేష్‌ (కేవడ్డేపల్లి ఎంపీటీసీ సెగ్మెంట్‌), రాజేష్‌ (పాకాల–2), మధుసూదన్‌రెడ్డి (మొగరాల), వినాయక (దామలచెరువు–3), బంగారుగోపి (పాకాల–3), శ్యామల (గాదెంకి), కే.మునిలక్ష్మి (పెద్ద రామాపురం), కే.బుజ్జమ్మ(పెద్దట్లబైలు), బీ.భానుమతి(పెద్ద రామాపురం), కుమారి (గాదంకి) ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. నాగరాజునాయుడు, ప్రదీప్‌కుమార్‌రెడ్డి, భూపతి నాయుడు, ఆనంద్‌నాయుడు, చంద్రశేఖర్‌నాయుడు, రావిళ్ల మోహన్‌, డేవిడ్‌ సురేష్‌, మున్నీర్‌, రఫీ, మోహన్‌కృష్ణ, ప్రవీణ్‌తోపాటు మరో 200 మంది తమపై దాడి చేశారని వారు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement