దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

దరఖాస్తుల ఆహ్వానం

Oct 24 2026 9:50 AM | Updated on Oct 24 2026 9:50 AM

తిరుపతి సిటీ: కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కౌశల్య వికాస్‌ యోజన పథకం ద్వారా జిల్లాలోని నిరుద్యోగ యువతకు పరిశ్రమలకు కావలసిన నైపుణ్యాలకు అనుగుణగా శిక్షణ అందించి ఉపాధి అవకాశాలను కల్పించడానికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభిృద్ధి సంస్థ ఆధ్వర్యంలో తిరుపతిలోని ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో స్కిల్‌ హబ్‌ ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా స్కిల్‌ హబ్‌లో 360 గంటల కాలవ్యవధితో ఇంటర్‌ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు జూనియర్‌ సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌ కోర్సును ఉచితంగా అందించనున్నట్లు డీఎస్‌డీఓ ఆర్‌ లోకనాథనం తెలిపారు. 18 నుంచి 35 ఏళ్ల లోపు వయస్సుగల ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 27వ తేదీలోపు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్‌తో పాటు మరిన్ని వివరాలకు 8143576866 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.

బోసిపోయిన నామినేషన్‌ కేంద్రాలు

తిరుపతి సిటీ: తిరుపతి నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల నామినేషన్‌ ప్రక్రియలో భాగంగా 18 డివిజన్లకు రీ నోటిఫికేషన్‌ జారీచేసింది. శుక్ర, శనివారాలలో నామినేషన్లు వేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. దీంతో నగరంలోని 18 డివిజన్లకు సంబంధించి స్వర్ణ వార్డు సచివాలయాల్లో ఏర్పాటు చేసిన నామినేషన్‌ కేంద్రాలు బోసిపోయాయి. శుక్రవారం ఆయా కేంద్రాల వద్ద పోలీసుల బందోబస్తు తప్ప పోటీ చేసే అభ్యర్థులు ఏ ఒక్కరూ అటువైపు కన్నెత్తి చూడలేదు. గతంలో అధికార పార్టీకి చెందిన గూండాలు రౌడీయిజం చేసి నామినేషన్‌ పత్రాలను చించి వేసి దాడులు చేసిన నేపథ్యంలో భయభ్రాంతులకు గురయ్యారు. దీంతో కలెక్టరేట్‌లో పోలీసు బందోబస్తు మధ్య శుక్రవారం వైఎస్సార్‌సీపీతో పాటు టీడీపీ, జనసేన, ఇండిపెండెంట్లు నామినేషన్లు దాఖలు చేశారు.

నేడు నామినేషన్ల స్క్రూట్నీ

తిరుపతి అర్బన్‌: తిరుపతిలోని డీఆర్‌డీఏ కార్యాలయంలో జెడ్పీటీసీలకు వచ్చిన నామినేషన్ల పరిశీలన శనివారం నిర్వహించనున్నట్టు జెడ్పీ సీఈవో శోభనబాబు తెలిపారు. చంద్రగిరి నియోజకవర్గం నామినేషన్లు ఉదయం 8 నుంచి 11 గంటల వరకు, అలాగే కోడూరు నియోజకవర్గం 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, గూడురు నియోజకవర్గం మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 1.30 వరకు, సూళ్లూరుపేట మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు, సత్యవేడు సాయంత్రం 4 నుంచి 5 వరకు, వెంకటగిరి సాయంత్రం 5 నుంచి 5.30 వరకు, నగరి నియోజకవర్గంలోని రెండు మండలాలకు సాయంత్రం 5.30 నుంచి 5.45 గంటల వరకు, శ్రీకాళహస్తి నియోజకవర్గం సాయంత్రం 5.45 నుంచి 7 గంటల వరకు పరిశీలన ఉంటుందని వెల్లడించారు.

తిరుపతిలో 18 డివిజన్లకు 59 నామినేషన్లు

తిరుపతి తుడా: తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల నామినేషన్లలో తొలి రోజు శుక్రవారం 18 డివిజన్లకు మొత్తం 59 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆయా ఆర్వో సెంటర్లతోపాటు కలెక్టరేట్‌లోనూ నామినేషన్లు వేయవచ్చని ఎన్నికల కమిషన్‌ ఆదేశించడంతో అభ్యర్థులంతా టీడీపీ దాడులు, దౌర్జన్యాలకు భయపడి కలెక్టరేట్‌లోనే నామినేషన్లు వేశారు. పోలీసు యంత్రాంగం ప్రటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. వైఎస్సార్‌సీపీ పోరాటంతో వచ్చిన రీ నోటిఫికేషన్‌ అవకాశాన్ని కూటమి అభ్యర్థులు సైతం ఉపయోగించుకోవడం చర్చనీయాంశమైంది. తిరుపతి కార్పొరేషన్‌ పరిధిలోని 66 డివిజన్లలో 18 డివిజన్లకు రీ నోటిఫికేషన్‌ ఇవ్వగా ఇందులో వైఎస్సార్‌సీపీ నుంచి 47, టీడీపీ – 4, జనసేన –1, ఆప్‌– 1, స్వతంత్ర అభ్యర్థులు –6 చొప్పున నామినేషన్లు వేశారు. టీడీపీ, జనసేన నుంచి నామినేషన్లు వేయడాన్ని ఆ పార్టీ నేతలు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు.

శ్రీవారి దర్శనానికి 10 గంటలు

తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 26 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. గురువారం అర్ధరాత్రి వరకు 65,113 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 26,391 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.82 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 10 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement