తిరుపతి ఎడ్యుకేషన్ : తిరుపతి ఎస్వీయూ క్రీడా మైదానంలో శుక్రవారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్) ఆధ్వర్యంలో అండర్–14, 17, 19 ఉమ్మడి చిత్తూరు జిల్లా అథ్లెటిక్స్ జట్ల ఎంపిక పోటీలను నిర్వహించారు. ఈ పోటీలకు ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి దాదాపు 1,200 మంది బాలబాలికలు పాల్గొన్నారు. ఈ క్రీడా పోటీల ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా డీఈఓ కేవీఎన్.కుమార్ పాల్గొని క్రీడా పోటీలను ప్రారంభించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యదర్శులు రమేష్, సాంబశివరావు, లోకనాథం, త్రిలోక సుందరి, అమ్ములు, జయకృష్ణ పర్యవేక్షణలో క్రీడాకారులకు వివిధ క్రీడల్లో పోటీలు నిర్వహించారు. మూడు కేటగిరిలో నిర్వహించిన ఆయా క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరచి మొదటి, రెండవ స్థానాలు సాధించిన 60 మంది బాలురు, 60 మంది బాలికలను జిల్లా జట్లుకు ఎంపిక చేశారు. ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు కర్నూలులో నిర్వహించే రాష్ట్ర స్థాయి అండర్–17 అథ్లెటిక్స్ పోటీలు, అలాగే ఈ నెల 30 నుంచి నవంబర్ 1వ తేదీ వరకు తూర్పుగోదావరి జిల్లాలో నిర్వహించే రాష్ట్ర స్థాయి అండర్–19 అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొననున్నట్టు ఎస్‌జీఎఫ్ తిరుపతి జిల్లా కార్యదర్శి సాంబశివరావు తెలిపారు.
అగ్రశ్రేణి శాస్త్రవేత్తలలో ఎస్వీయూ వీసీ
తిరుపతి సిటీ: ప్రపంచంలోని అగ్రశ్రేణి రెండు శాతం శాస్త్రవేత్తలలో ఎస్వీయూ వీసీ టాటా నర్సింగరావుతో పాటు మరో ఆరుగురికి స్థానం లభించింది. వీరు ప్రతిష్టాత్మక స్టాన్ ఫోర్డ్ ఎల్సెవియర్ 2026 వరల్డ్ టాప్ టు పర్సెంట్ హైలీ సైటెడ్ సైంటిస్ట్స్ లిస్ట్ 2026లో చోటు సంపాదించుకున్నారు. శాసీ్త్రయ పరిశోధన, ఆవిష్కరణ, విద్యా నైపుణ్యం పట్ల విశ్వవిద్యాలయం నిరంతర నిబద్ధతను ప్రతిబింబిస్తూ అద్భుతమైన విజయం వర్సిటీకి లభించింది. గుర్తింపు పొందిన ఆరుగురు శాస్త్రవేత్తలలో ఐదుగురు కెరీర్ లాంగ్ సైంటిఫిక్ ఇంపాక్ట్ కేటగిరీలోనూ, ఇద్దరు సింగిల్ ఇయర్ సైంటిఫిక్ ఇంపాక్ట్ కేటగిరీలో చోటు దక్కించుకోగా, ఒక శాస్త్రవేత్త రెండు జాబితాలలోనూ కనిపించి ఘనత సాధించారు. ఈ ఘనత సాధించిన వారిలో వీసీ ప్రొఫెసర్ టాటా నరసింగ రావుతో పాటు రిటైర్డ్ ఫిజిక్స్ ప్రొఫెసర్ సీకే జయశంకర్, జువాలజీ రిటైర్డ్ ప్రొఫెసర్ పీ.శ్రీనివాసులురెడ్డి, రసాయనశాస్త్ర విశ్రాంత ప్రొఫెసర్ ఏ.కృష్ణయ్య, భౌతికశాస్త్రం ప్రొఫెసర్లు వీ. రాజగోపాలర్‌రెడ్డి, వైసీ రత్నాకరం ఉన్నారు.
వీఆర్‌కు నాయుడుపేట ఎస్‌ఐ
నాయుడుపేట టౌన్: నాయుడుపేట అర్బన్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ శివశంకర్‌ను వీఆర్‌కు బదిలీ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నిర్లక్ష్యంగా విధులు నిర్వర్తించారన్న ఉద్దేశంతో శివశంకర్‌ను ఎస్పీ వీఆర్‌కు పిలిచినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా నాయుడుపేట ఎంపీటీసీ నామినేషన్ కేంద్రం వద్ద ఎస్‌ఐ విధుల్లో ఉండగా కాపులూరు ఎంపీటీసీ సెగ్మెంట్‌కు సంబంధించి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి నామినేషన్ పత్రాలను టీడీపీకి చెందిన గుండాలు లాక్కొని చించివేశారు. అక్కడ విధుల్లో ఉన్న ఎస్‌ఐ వారిని అడ్డుకున్నారు. దీంతో టీడీపీ నాయకులు ఎస్‌ఐపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అంతే రాత్రికి రాత్రే వీఆర్‌కు బదిలీ చేసినట్లు సమాచారం.
వేర్వేరు ప్రమాదాల్లో
ముగ్గురికి తీవ్ర గాయాలు
నాయుడుపేట టౌన్ : పట్టణ పరిధిలో రెండు వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లు శుక్రవారం రాత్రి పోలీసులు తెలిపారు. వారు తెలిపిన మేరకు వివరాలు.. తిరుపతి సుబ్బయ్య కాలనీకి చెందిన పీ.మధుశేఖర్, పీ.దిలిప్‌కుమార్ ఈనెల 20వ తేదీన కారులో నెల్లూరుకు వెళ్లి తిరిగి తిరుపతికి వెళుతుండగా మార్గమధ్యంలో విన్నమాల గ్రామ సమీపంలో ఓవర్ బ్రిడ్జి వద్ద ముందు వెళుతున్న లారీ ఒక్క సారిగా నిలపడంతో కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న మధు శేఖర్, దీలిప్‌కుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అదేవిధంగా తమిళనాడు ప్రాంతానికి చెందిన నరేంద్రన్ అనే లారీ డ్రైవర్ చైన్నె నుంచి లోడింగ్ కోసం 22న నాయుడుపేటకు వచ్చాడు. లారీని పట్టణ పరిధిలోని శ్రీకాళహస్తి బైపాసు రోడ్డుపై నిలిపి రోడ్డు దాటుతుండగా నాయుడుపేట వైపు నుంచి తిరుపతి వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అతనిని ఢీకొంది. ఈ రెండు ప్రమాదాలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


