కుయుక్తులు అమలు చేసిన
కూటమి నేతలు
ఇష్టారాజ్యంగా రెచ్చిపోయిన
టీడీపీ గూండాలు
ఓటమి భయంతో అడుగడుగునా కుతంత్రాలు
పచ్చమూక పన్నాగాలకు
సహకరించిన పోలీసులు
అదే బాటలో నడిచిన రిటర్నింగ్ అధికారులు
తిరుపతి తుడా : తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌కు సంబంధించి 66 డివిజన్లలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు మొత్తం 449 నామినేషన్లు దాఖలైనట్లు కమిషనర్ జయకృష్ణ తెలిపారు. ఇందులో వైఎస్సార్సీపీ–87, టీడీపీ– 172, జనసేన– 67, బీజేపీ–15 , సీపీఎం–3, సీపీఐ–3 , ఇతర పార్టీలు స్వతంత్ర అభ్యర్థులతో కలిపి మొత్తం 449 నామినేషన్లు వచ్చాయని వివరించారు. అయితే 66 డివిజన్లలో 18 డివిజన్లకు వైఎస్సార్సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా టీడీపీ గూండాలు అడ్డుకున్నారు.
సాక్షి టాస్క్‌ఫోర్స్ : స్థానిక సంస్థల ఎన్నికల నామినేష న్ల ప్రక్రియ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో రాజకీయ వివాదానికి దారితీసింది. వైఎస్సార్సీపీ మేయ ర్ అభ్యర్థి వాసు యాదవ్‌తో పాటు అన్ని డివిజన్ల అభ్యర్థులను నామినేషన్లు వేయనివ్వకుండా పోలీసుల సహకారంతో టీడీపీ గూండాలు అడుగడుగునా కుట్రలు చేసి అడ్డంకులు సృష్టించారు. ఈ క్రమంలోనే ముందస్తుగా పక్కా ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. ప్లాన్ ఏ, బీ, సీ, డీ, ఈ పేరుతో అమలు చేశారు.
గేటు వద్ద ప్లాన్ ‘ఏ’
నామినేషన్లు వేయటానికి వార్డు సచివాలయానికి, మున్సిపల్ కార్యాలయానికి వెళ్లిన వైఎస్సార్సీపీ అభ్యర్థులను గేటు వద్దే అడ్డుకున్నారు. ఇందుకోసం తమిళనాడు, కర్ణాటక నుంచి తీసుకువచ్చిన వందల మంది గంజాయి బ్యాచ్‌ని మొహరించారు. ప్రతి చోట 50 నుంచి 100 మందికి తగ్గకుండా టీడీపీ గూండాలను ఏర్పాటు చేశారు. నామినేషన్ వేసేందుకు వచ్చిన ప్రతి వైఎస్సార్సీపీ అభ్యర్థిని అడ్డుకుని వెనక్కు పంపేలా అరాచకాలు సృష్టించారు. అభ్యర్థులపై దాడిచేసి.. చేతిలోని నామినేషన్ పత్రాలను లాక్కుని చించివేశారు. వీలైనంత మంది అభ్యర్థులను గేటు వద్ద నుంచే వెనక్కు తరిమేశారు. ప్లాన్ ఏ అమలులో భాగంగానే ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, మేయర్ అభ్యర్థి వాసుయాదవ్‌ను సైతం అడ్డుకుని వెనక్కి పంపేశారు.
ఆర్ఓ కార్యాలయం గేటు దగ్గర ప్లాన్ ‘బి’
నామినేషన్ దాఖలు చేసే వైఎస్సార్సీపీ అభ్యర్థులు మొదటి గేటు దాటి ఆర్ఓ గదిలోకి వెళ్లే గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అక్కడ ఆధార్ కార్డులు చూపించమని పోలీసులు అడగడం.. వాటిని చూపించే సందర్భంలో పక్కనే కూటమి అభ్యర్థి లేదా అనుచరులు వైఎస్సాసీపీ వారి పత్రాలు లాగేసుకుని తరమేయడం.
ప్రశ్నలతో ఇబ్బందిపెట్టడమే ప్లాన్ ‘సి’
నామినేషన్ సమర్పించేందుకు వచ్చిన అభ్యర్థుల నుంచి పత్రాలు స్వీకరించడం, వాటిని పరిశీలించడం ఎన్నికల అధికారుల విధి. అయితే పలు అడ్డంకులు దాటుకుని ఆర్ఓ గదిలోకి ప్రవేశించిన అభ్యర్థులకు ఎదురైన ప్రశ్నలపై పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. అవసరం లేని ప్రశ్నలు సంధించి అభ్యర్థులను భయాందోళనకు గురి చేయడమే తమ అసలు విధిగా అధికారులు ప్రవర్తించారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆర్ఓ గదిలో వీడియోలు, ఫొటోలకు వెసులుబాటు కల్పించలేదని మండిపడుతున్నారు.
‘చిల్లర’ వేషాలే ప్లాన్ ‘డి’
మూడు ప్లాన్లు దాటుకుని నామినేషన్ వేసేందుకు వచ్చిన వైఎస్సార్సీపీ అభ్యర్థులకు తర్వాత చిత్రమైన చేదు అనుభవం ఎదురైంది. నామినేషన్‌న్ దాఖలు చేయడానికి వచ్చిన సుమారు పది మంది కూటమి అభ్యర్థులు డిపాజిట్ సొమ్ము కింద రూ.2 నాణేలను సంచుల్లో తీసుకువచ్చారు. వారంతా నామినేషన్లు స్వీకరించే సమయానికి ముందే క్యూలో నిల్చోవడం ప్రారంభించారు. ప్రతి నామినేషన్ కేంద్రాల వద్ద పది మంది చొప్పున క్యూలో నిల్చొని ఉన్నట్లు వైఎస్సార్సీపీ అభ్యర్ధులు వెల్లడించారు. వారి తర్వాత వైఎస్సార్సీపీ అభ్యర్థులు నిలబడాల్సిన పరిస్థితి. చివరకు పది మంది కూటమి అభ్యర్థుల డిపాజిట్ సొమ్మును లెక్కించేసరికి సమయం మించిపోవడంతో క్యూలో ఉన్న వైఎస్సార్సీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయకుండా వెనక్కు వెళ్లేలా ప్లాన్ అమలు చేశారు.
ఫైనల్ ప్లాన్ ‘ఈ’ అమలుకు రంగం సిద్ధం
అన్ని అడ్డంకులు దాటుకుని నామినేషన్లు వేసిన వైఎస్సార్సీపీ అభ్యర్థులకు మరో గండం పొంచి ఉంది. నామినేషన్లు వేసిన అభ్యర్థులతో ఆర్ఓలు తెల్లకాగితాలపై సంతకాలు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై వైఎస్సార్సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ భూమన కరుణాకరరెడ్డి, ఎంపీ గురుమూర్తి ఆరోపణలు గుప్పించారు. నామినేషన్ల పరిశీలనలో చివరకు తిరస్కరణ అస్త్రం ప్రయోగించేందుకే వైట్ పేపర్‌పై సంతకాలు తీసుకున్నారని కూటమి నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థుల సంతకాల ఆధారంగా నామినేషన్లు తిరస్కరించి, కూటమి అభ్యర్థులను ఏకగ్రీవం చేసేందుకు పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ కుట్రలపై వైఎస్సార్సీపీ తీవ్రంగా స్పందించింది. వెంటనే రాష్ట్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేసింది.
అభ్యర్థులకు మద్దతుగా మాజీ మంత్రి
అభ్యర్థి నామినేషన్ చించివేయడంతో మాజీ మంత్రి ఆర్కే రోజా స్వయంగా నామినేషన్ కేంద్రానికి చేరుకున్నారు. అభ్యర్థితో కలిసి నామినేషన్ దాఖలు చేయించారు. ఈ సమయంలో కేజేకుమార్ ఆయన కుమారులు, అనుచరులు నామినేషన్ కేంద్రం వైపు దూసుకెళ్లడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఎన్నికల్లో పోటీ చేయడానికి భయపడే వారే ప్రత్యర్థులను అడ్డుకునేందుకు యత్నిస్తారని ఆర్కే రోజా మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉందని, ఆ హక్కును కాలరాసే ప్రయత్నాలను సహించబోమని స్పష్టం చేశారు.
టీడీపీలో బహిర్గతమైన విభేదాలు
నామినేషన్ల సందర్భంగా టీడీపీ నేతల అంతర్గత విబేధాలు బహిర్గతమయ్యాయి. కొత్తగా చేరిన నేతలతో సీనియర్లకు వివాదాలు తలెత్తాయి. ఎవరికి వారు తాము ఎంపిక చేసిన వారే అభ్యర్థులంటూ హడావుడి చేయడంతో కశింమిట్ట సచివాలయం వద్ద ఘర్షణ వాతావరణం ఏర్పడింది.
వైఎస్సార్సీపీ అభ్యర్థులను అడ్డుకునేందుకు కుట్రలు
నగరిలో దౌర్జన్యకాండ
సాక్షి టాస్క్‌ఫోర్స్ : ఎన్నికల్లో ప్రజాక్షేత్రానికి వెళ్లాల్సిన టీడీపీ నేతలు ఏకగ్రీవం కోసం దౌర్జన్యాలకు పాల్పడ్డారు. నగరిలోని కశింమిట్ట సచివాలయం వద్ద 3వ రోజు ఆదివారం నామినేషన్ల ప్రక్రియలో రౌడీయిజం ప్రదర్శించారు. టీడీపీలో ఇటీవలే చేరిన కేజే.కుమార్, ఆయన కుమారులు గూండాగిరీ చెలాయించారు. 4, 36 వార్డుల వైఎస్సార్ సీపీ అభ్యర్థులు తామరసెల్వి, ఇంద్రయ్య నామినేషన్ పత్రాలను చించివేశారు. వైఎస్సార్ సీపీ నేత మహేశ్వరన్పై దాడిచేశారు.


