స్థానిక ఎన్నికల్లో నామినేషన్ వేసేందుకు వైఎస్సార్సీపీ అభ్యర్థులు పెద్ద సాహసమే చేయాల్సి వచ్చింది. తిరుపతి నగరపాలక సంస్థ వైఎస్సార్సీపీ మేయర్ అభ్యర్థి డాక్టర్ వాసుయాదవ్ సాగించిన పోరాటమే ఇందుకు నిదర్శనం. ప్రజాస్వామ్య దేశంలో నామినేషన్ వేయటానికి యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి సుమారు 10 గంటల పాటు ప్రాణాలను పణంగా పెట్టాల్సిన దుస్థితి. వాసుయాదవ్ మేయర్ స్థానానికి నామినేషన్ వేసేందుకు శుక్రవారం యత్నించగా టీడీపీ గూండాలు అడ్డుకున్నారు. రెండో రోజు శనివారం వాసుయాదవ్తో పాటు ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం విఫలయత్నం చేశారు. టీడీపీ గూండాలు మున్సిపల్ కార్యాలయం పరిసరాల్లో మొహరించిన నేపథ్యంతో నామినేషన్ వేయడం ప్రశ్నార్థకంగా మారింది. ప్రజాస్వామ్యం కల్పించిన హక్కును కాపాడుకునేందుకు వాసు యాదవ్ శనివారం రాత్రి నామినేషన్ పత్రాలతో మెడికల్ కళాశాల గ్రౌండ్‌లోనే ఉండిపోయారు. వేకువజామునే టీడీపీ మూకల కళ్లుగప్పి మెడికల్ కళాశాల బాయ్స్ హాస్టల్‌కి వెనుక వైపున గోడ మీద నుంచి ముళ్లపొదల్లో దూకేశారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం వెనుక నుంచి మెరుపు వేగంతో ఆర్ఓ చాంబర్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో తనను గుర్తించకుండా ఉండేందుకు హెల్మెట్ ధరించారు. అయితే పోలీసులు చివరి నిముషంలో పసిగట్టి వాసుయాదవ్ని పట్టుకునేందుకు వెంటపడ్డారు. అయినప్పటికీ పరుగెత్తుకుంటూ మెట్లు ఎక్కి ఉదయం 9.30 గంటలకు ఆర్ఓ చాంబర్‌కు చేరుకున్నారు. పోలీసుల వచ్చి చుట్టుముట్టగా మేయర్ అభ్యర్థినని చెప్పి ఆధారాలను చూపించారు. పచ్చమూక పైశాచికత్వం నేపథ్యంలో వాసుయాదవ్ మేయర్ అభ్యర్థిగా నామినేషన్ వేయడమే అతి పెద్ద విజయంగా తిరుపతి వాసులు చర్చించుకోవడం విశేషం.


