తిరుపతి సిటీ: పుంగనూరులో నామినేషన్ కేంద్రం వద్ద టీడీపీ గూండాల దాడిలో సీఆర్పీఎఫ్ జవాన్లు తీవ్రంగా గాయపడిన విషయం విధితమే. ఆదివారం ఈ మేరకు తిరుపతి నారాయణాద్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీఆర్పీఎఫ్ జవాన్లను వైఎస్సార్సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి వారి ఆర్యోగ పరిస్థితిని తెలుసుకున్నారు.
శ్రీవారి దర్శనానికి 12 గంటలు
తిరుమల: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ కృష్ణతేజ అతిథి గృహం వద్దకు చేరుకుంది. శనివారం అర్ధరాత్రి వరకు 83,806 మంది స్వామిని దర్శించుకున్నారు. 34,449 మంది భక్తులు తలనీలాలు ఇచ్చారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.17 కోట్లు వచ్చాయి. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనమవుతోంది. దర్శనం టిక్కెట్లు లేని వారికి 12 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లున్న వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకుంటున్నారు. ఇదిలా ఉండగా సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ముందుగా వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించేది లేదని స్పష్టం చేసింది.
22న ఉద్యోగాలకు
ఇంటర్వ్యూలు
తిరుపతి అర్బన్ : తొట్టంబేడు మండలం రౌతుసూరమాల వద్ద గ్రీన్ప్యానెల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్లో ఈ నెల 22వ తేదీ ఉదయం 8.30 గంటల నుంచి 39 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి లోకనాథం ఆదివారం తెలిపారు. ఆసక్తి గలవారు నైపుణ్యం.ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్సైట్ లో ద్వారా పేరు నమోదు చేసుకోవాలని వెల్లడించారు. ఐటీఐ, పిట్టర్, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ ఉత్తీర్ణులైన పురుషులు మాత్రమే అర్హులని పేర్కొన్నారు. ఇతర వివరాలకు 9000109045, 6303578886, 9988853335 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
యువశ్రీ మురళికి
సాహితీ పురస్కారం
బుచ్చినాయుడుకండ్రిగ: మండలంలోని కల్లివెట్టు జెడ్పీ ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత యువశ్రీ మురళికి గార్లపాటి సాహితీ పురస్కారం లభించింది. ఆదివారం తిరుపతిలోని రాస్ భవనంలో ఆచార్య గార్లపాటి దామోదరనాయుడు చేతుల మీదుగా అవార్డు అందుకు న్నారు. మేడసాని మోహన్, ఆముదాల మురళి, బాలకృష్ణారెడ్డి, సాకం నాగరాజు, మధుజ్యోతి, గంగాధరప్రసాద్, శ్రీమన్నారాయణ, కిట్టన్న, మల్లేశ్వరరావు, శోభ, అంకమనాయుడు, అరుణకుమారి, సహదేవనాయుడు పాల్గొన్నారు.
22 నుంచి సివిల్ సర్వీసెస్ క్రీడా పోటీలకు ఎంపిక
తిరుపతి ఎడ్యుకేషన్ : తిరుపతిలో ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ జిల్లా స్థాయి క్రీడా ఎంపిక పోటీలను ఈ నెల 22వ తేదీ నుంచి రెండు రోజుల పాటు నిర్వహించనున్నట్లు డీఎస్డీఓ ఎన్.శశిధర్ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అర్హత కలిగిన సివిల్ సర్వీసెస్ ఉద్యోగులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చన్నారు. అథ్లెటిక్స్, బాస్కెట్ బాల్, బెస్ట్ ఫిజిక్, క్యారమ్స్, చెస్, క్రికెట్, ఫుట్బాల్, హాకీ, కబడ్డీ, ఖోఖో, లాన్ టెన్నిస్, పవర్ లిఫ్టింగ్, షటిల్ బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్, యోగా క్రీడల్లో ఎంపిక పోటీలు ఉంటాయని వివరించారు. పాల్గొనదలచిన వారు 22, 23వ తేదీల్లో శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఎస్వీ యూనివర్సిటీ క్రీడా మైదానం, ఎస్వీ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలోని ఫుట్బాల్, హాకీ మైదానంలో ఉదయం 9గంటలకు హాజరుకావాలని కోరారు. క్రీడాకారులు వారి సొంత పరికరాలతో రావాలని, జిల్లా స్థాయిలో ఎంపికై న వారు ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు గుంటూరులో నిర్వహించే రాష్ట్ర స్థాయి ఎంపిక పోటీల్లో పాల్గొంటారని వెల్లడించారు. ఇతర వివరాలకు తిరుపతిలోని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ కార్యాలయ పనివేశల్లో సంప్రదించాలని సూచించారు.


