నాయుడుపేట టౌన్: నాయుడుపేట పట్టణానికి చెందిన టీడీపీ నాయకులు పీ.నరసింహనాయుడు, బీజేపీ నాయుడుపేట రూరల్ ప్రధాన కార్యదర్శి పుట్టు సూరిబాబు ఆయా పార్టీలకు రాజీనామా చేసి శనివారం వైఎస్సార్ కాంగ్రెస్పార్టీలో చేరారు. పట్టణంలోని వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ క్యాంపు కార్యాలయంలో సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యతో పాటు ఆ పార్టీ నాయకులు పార్టీలో చేరిన వారితో పాటు అనుచరులకు, మహిళలకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీ, బీజేపీలలో సరైన ఆధరణ లేకపోవడంతో ఆ పార్టీలకు రాజీనామా చేసినట్టు వారు పేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ పట్టణ అధ్యక్షుడు కలికి మాధవరెడ్డి, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కామిరెడ్డి రాజారెడ్డి, కట్టా భవానీశంకర్రెడ్డి, బైనా మల్లికార్జునరెడ్డి, కటకం జయరామయ్య, పేర్నాటి రాహుల్, మధురెడ్డి, పార్టీకి చెందిన పలు విభాగాల నాయకులు పాల్గొన్నారు.
సీసీ టీవీ, సెక్యూరిటీ అలారమ్పై ఉచిత శిక్షణ
చంద్రగిరి: యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ చంద్రగిరిలో అక్టోబర్ 26 తేదీ (సోమవారం) నుంచి 14 రోజుల పాటు పురుషులకు సీసీ టీవీ ఇన్స్టాల్, సెక్యూరిటీ అలారమ్, స్మోక్ డిటెక్టర్లపై ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్టు సంస్థ డైరెక్టర్ బాలకోటి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. తెల్లరేషన్ కార్డు కలిగిన తిరుపతి జిల్లా గ్రామీణ ప్రాంతానికి చెందిన 19 నుంచి 50 సంవత్సరాల మధ్య వయసు కలిగిన పురుషులు అర్హులని తెలిపారు. కనీస విద్యార్హత 10వ తరగతి చదువుకుని ఉండాలని పేర్కొన్నారు. శిక్షణ సమయంలో ట్రైనీస్కి ఉచిత భోజనంతో పాటు శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ధ్రువపత్రాలు అందజేస్తామని వెల్లడించారు. శిక్షణ తీసుకోదలచిన వారు ఆధార్, రేషన్ కార్డు జిరాక్స్, ఏదైనా ఎడ్యుకేషన్ ధృవీకరణ పత్రం జిరాక్స్ కాపీలు, 4 పాసుపోర్టు సైజు ఫొటోలతో సంస్థకి వచ్చి వారి పేర్లు నమోదు చేయించుకోవాలని ఆయన సూచించారు. మరిన్ని వివరాలకు యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ, 11–48 ద్వారకానగర్ (రాయల్ విక్టరీ స్కూల్ దగ్గర) కొత్తపేట, చంద్రగిరి. ఫోన్: 79896 80587, 87908 60657, 96764 50037 నంబర్లను సంప్రదించాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.


