వెంకటగిరి రూరల్: పొలం విషయమై గ్రామంలో ఇరువురు తగాదా పడుతుండగా అక్కడే ఉన్న మాజీ సర్పంచ్ సర్దుబాటు చేసేందుకు ప్రయత్నించారు. అక్కడే ఉన్న జనసేనకు చెందిన వ్యక్తి మాజీ సర్పంచ్పై దాడి చేశారు. ఈ ఘటన మండలంలోని పాళెంకోట గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. బాధితుడు, పాళెంకోట వైఎస్సార్సీపీ మాజీ సర్పంచ్ గంగిరెడ్డి వేణుగోపాల్రెడ్డి కథనం.. తిరుపతి ఎంపీ గ్రాంట్ ద్వారా పాళెంకోట గ్రామానికి సీసీ రోడ్లు మంజూరయ్యాయి. దీనికి సంబంధించిన మెటీరియల్ వచ్చింది. ప్రస్తుతం వర్షాలు పడుతున్న నేపథ్యంలో పనులు ఎప్పుడు చేయాలని చర్చిస్తున్నారు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన జనసేన నాయకుడు సుధాకర్ , తిరుపాల్ ఇద్దరూ పొలం విషయమైన గోడవపడ్డారు. వారికి మాజీ సర్పంచ్ సర్దుబాటు చేసే ప్రయత్నం చేయగా.. సుధాకర్ దాడి చేసినట్టు బాధితుడు పేర్కొన్నారు. ఈ దాడిలో వేణురెడ్డి బుజానికి గాయమైంది. తమ గ్రామంలో సుమారు 15 మంది రైతులను సుధాకర్ ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు తెలిపారు. పొలంలో సాగుచేసుకోనివ్వకుండా 17 మందిపై కోర్టు నుంచి నోటీసులు జారీ చేపించారని, అందులో తనుకూడా ఓ బాధితుడినని తెలిపారు. కూటమి ప్రభుత్వ అండతో తనతోపాటు గ్రామ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు, మజీ సర్పంచ్ వేణురెడ్డి తెలిపారు.
వెంకటగిరి అభివృద్ధే లక్ష్యం
వెంకటగిరి (సైదాపురం): వెంకటగిరి మున్సిపాలిటీని అత్యున్నతంగా అభివృద్ధి చేసి రూపురేఖలు మారుస్తామని వైఎస్సార్సీపీ మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థి బొలిగర్ల దీవెన తెలిపారు. శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా ఆమె నామినేషన్ దాఖలు చేశారు. మొదటగా వెంకటగిరి గ్రామశక్తి శ్రీ పోలేరమ్మతల్లి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నేదురుమల్లి నివాసం వద్దకు చేరుకున్నారు. నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డితోపాటు, 36 వార్డులకు సంబంధించిన వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, నేతలు ఆమెకు ఘన స్వాగతం పలికారు.


