తిరుపతి మంగళం : తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఎవ్వరూ అధైర్య పడవద్దని కర్నూలు, నంద్యాల రీజనల్ కో–ఆర్డినేటర్ భూమన కరుణాకరరెడ్డి ధైర్యం చెప్పారు. తిరుపతి పద్మావతిపురంలోని తన నివాసంలో నామినేషన్లు వేయనీయకుండా గాయపరిచిన వైఎస్సార్సీపీ అభ్యర్థులతో భూమనతో పాటు తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, తిరుపతి జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు, తిరుపతి సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి మాట్లాడారు. ప్రజాక్షేత్రంలో, ప్రజల ఓట్లతో కార్పొరేషన్ ఎన్నికల్లో గెలవలేమన్న భయంతోనే కూటమి నాయకులు గూండాలు, అరాచకశక్తులను పిలిపించుకుని ఇలాంటి దాడులకు తెగబడుతున్నారని భూమన కరుణాకరరెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు, లోకేష్ రెడ్‌బుక్ పాలనకు స్థానిక ఎన్నికలే నిదర్శనమన్నారు. జగనన్న తిరిగి ముఖ్యమంత్రి కాగానే కూటమి నాయకులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
ఓటమి భయంతోనే అడ్డంకులు
తిరుపతి తుడా: వైస్సార్సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయనీయకుండా ఓటమి భయంతో కుట్ర పూరితంగా టీడీపీ నాయకులు ఎక్కడికక్కడ అడ్డుకోవడం దారుణమని రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పుంగునూరు ఘటనలో టీడీపీ గుండాల దాడిలో తీవ్రంగా గాయపడి తిరుపతి నారాయణాద్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీఆర్పీఎఫ్ సిబ్బంది అభయ్‌కుమార్ సింగ్, చాంద్‌బాషా, శైలేష్ కుమార్‌సింగ్‌ను ఆయన శనివారం పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ వాల్ల పతనం వాళ్లే కోరుకుంటున్నారని, పుంగనూరులో ఎన్నికలు జరిగితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుందన్న భయంతోనే నామినేషన్లు అడ్డుకుంటున్నారని చెప్పారు. నామినేషన్లు వేసేందుకు వెళ్తున్నాం అని ముందే సమాచారం ఇచ్చామని, వెయ్యి మందికి పైగా తమపై దాడి చేసేందుకు బయటి వ్యక్తులు పుంగనూరులో ఉంటే పోలీసులు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. తాము సమాచారం ఇచ్చినా పట్టించుకోకుండా తమపైనే దాడి చేశారని తెలిపారు. అధికారులు తాము అందించిన నామినేషన్లు తీసుకోకుండా చైర్మన్ అభ్యర్థి మహిళ పైన కేసు పెట్టి బెదిరించారన్నారు. మాజీ ఎంపీ రెడ్డెప్ప, తమ తమ్ముడు సుధీర్‌రెడ్డితో పాటు 30 వార్డుల్లో పోటీలో ఉన్న వారి అందరిపైనా కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం లేని సమయంలో వీళ్ల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. సీఆర్పీఎఫ్ సిబ్బంది ప్రాణాలు పణంగా పెట్టి తమను కాపాడారని, వారిలో ఒకరికి తలకు తీవ్ర గాయాలుకాగా మరొకరికి రిబ్స్ విరిగి పోయాయని, ఒకరికి చేయి విరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి ఎంపీ గురుమూర్తి చేతిలో నామినేషన్లు లాక్కోవడం దారుణమని, ఇక ఎన్నికలు జరపడం ఎందుకని ప్రశ్నించారు. అధికారం శాశ్వతం కాదన్న విషయం టీడీపీ నేతలు గుర్తించాలని సూచించారు. పులివెందులలో పోలీసులు కాల్పులు జరపడం విచారకమన్నారు.


