తిరుపతి రూరల్: హనుమంత వాహనంపై శ్రీరామచంద్రుడు.. గజ వాహనంపై గోవిందుడుగా తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి దర్శనమిచ్చారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవ రోజు శనివారం ఉదయం హనుమంత వాహనంపై శ్రీరామచంద్రునిగా, రాత్రి గజ వాహనంపై కల్యాణ వెంకన్నగా భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి గజేంద్రమోక్ష ఘట్టాన్ని తలపించేలా సాగిన సేవలో స్వామివారిని దర్శించుకున్న భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. సాయంత్రం నిర్వహించిన వసంతోత్సవం, ఊంజల్ సేవ భక్తులను అలరించాయి. వాహన సేవలకు అవసరమైన పూలమాలల తయారీలో గ్రామ మహిళలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఆలయ వ్యవస్థాపకులు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి తన ఇంటి వద్ద వంటకాల తయారీకి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు నాణ్యమైన భోజనం అందేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వాహన సేవల్లో కోలాటాలు, చెక్క భజనలు కనువిందు చేశాయి. హనుమంత వాహన సేవకు గంగసుబ్బయ్య వీధి, పార్లపల్లి వీధి, నాటారు వీధి, గోవిందరెడ్డి వీధుల్లోని భక్తులు సారె తీసుకువచ్చారు. అలాగే గజవాహన సేవకు ఉప్పరపల్లి, ఉప్పరపల్లి దళితవాడ, ఉప్పరపల్లి ఆడిఆంధ్రవాడ కాలనీల నుంచి భక్తులు సారె తీసుకువచ్చి స్వామికి సమర్పించారు.


