తిరుపతి అర్బన్: రిజర్వేషన్ల జాబితాలో తన సంతకం ఉంటేనే ఫైనల్గా భావించాలని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ స్పష్టం చేశారు. గురువారం కలెక్టరేట్లో ఆయన ఎస్పీ సుబ్బరాయుడు, జేసీ గోవిందరావు, డీఆర్వో నరసింహులుతో కలసి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ కొందరు ఉద్యోగులు ఫైనల్ రిజర్వేషన్ జాబితా విడుదల చేయకముందే తమ వద్ద ప్రతిపాదనలతో కూడిన జాబితాను విడుదల చేయడాన్ని తప్పుబట్టారు. అలాంటి వారిపై శాఖాపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఎన్నికల్లో పోటీచేయనున్న అభ్యర్థులకు అవసరమైన నోడ్యూస్, క్యాస్ట్ సర్టిఫికెట్స్ జాప్యం లేకుండా ఇవ్వాలని చెప్పారు.
అమల్లోకి ఎన్నికల కోడ్
రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం తొలుత మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీలకు నోటిఫికేషన్ విడుదల చేశామన్నారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషనతో పాటు వెంకటగిరి, పుత్తూరు, సూళ్లూరుపేట, నాయుడుపేట మున్సిపాలిటీల పరిధిలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందన్నారు. మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీల ఎన్నికలకు ఈ నెల 16, 17, 18 తేదీల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారని, మేయర్, మున్సిపల్ చైర్పర్సన్ పదవులకు, వార్డు సభ్యులకు వేర్వేరుగా నామినేషన్ల స్వీకరణ ఉంటుందన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ఈ నెల 19వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుండగా, గ్రామ పంచాయతీ ఎన్నికలకు మూడు విడతల్లో నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు చెప్పారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత వచ్చే నామినేషన్లను స్వీకరించబోమని ఆయన స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 19వ తేదీన నామినేషన్ల పరిశీలన, 21న నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ఉంటుందన్నారు. అనంతరం అదే రోజు సాయంత్రం పోటీలో నిలిచే అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తామాన్నరు. ఈ నెల 28న పోలింగ్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలిపారు.
పటిష్ట భద్రత
ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ జిల్లాలో పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో పోలీసు శాఖ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టిందని తెలిపారు. తమకు ఏ పార్టీతో సంబంధం లేదని చెప్పారు. ఈ ఏడాదిలో 1,200 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేశామని చెప్పారు. రవాణా సమయంలో రూ.50 వేల వరకు నగదు తీసుకుపోవచ్చని, అంతకు మించి నగదు ఉంటే లెక్కలు చూపాలని పేర్కొన్నారు.


