తిరుపతి రూరల్: తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాల్గో రోజు గురువారం ఉదయం కల్పవృక్ష వాహనంపై మురళీకృష్ణుని అలంకరణలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి ఉభయదేవేరులతో కలిసి సర్వభూపాల వాహనంపై పురవీధుల్లో విహరించారు. స్వామి వారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో తుమ్మలగుంట గ్రామం గోవింద నామస్మరణలతో మార్మోగింది.
సర్వభూపాల వాహనంపై విహారం
రాత్రి ఉభయ దేవేరులతో కలిసి సర్వభూపాల వాహనంపై స్వామి వారు భక్తులను అనుగ్రహించారు. అంతకు ముందు ఆలయంలో ఊంజల్ సేవ నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపకులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సతీసమేతంగా వాహన సేవల్లో పాల్గొన్నారు. కళాకారుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకోగా ఎస్వీ సంగీత కళాశాల కళాకారులు ఆలపించిన అన్నమయ్య సంకీర్తనలు ఆధ్యాత్మికానుభూతిని పంచాయి.
భక్తిశ్రద్ధలతో సారె సమర్పణ
కల్పవృక్ష వాహన సేవకు శ్రీనివాసపురం, నాగార్జున కాలనీలకు చెందిన భక్తులు సారె తీసుకు వచ్చి స్వామికి సమర్పించారు. అలాగే సర్వభూపాల వాహనానికి స్పందన అపార్ట్ మెంట్, స్పందన గోల్డ్ అపార్ట్మెంట్ వాసులు సారె సమర్పించారు. సారె తీసుకువచ్చిన వారికి ఆలయ వ్యవస్థాపకులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి దంపతులతో పాటు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి సాదర స్వాగతం పలికారు.
నేడు గరుడోత్సవం
తుమ్మలగుంటలో శుక్రవారం రాత్రికి గరుడోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు కల్యాణ వెంకన్న గురుడ వాహనాన్ని అధిరోహించి తిరు వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించనున్నారు.


