● ఖాళీ అవుతున్న డ్యామ్లు, రిజర్వాయర్లు ● ఎండిపోతున్న బోర్లు, బావులు ● వేసవిలో మరిన్ని తిప్పలు తప్పవంటున్న నిపుణులు ● ముందస్తు నిల్వలపై దృష్టి సారించిన కూటమి ప్రభుత్వం
తిరుపతి జిల్లా వ్యాప్తంగా కరువు పరిస్థితులు నెలకున్నాయి. ప్రతి ఏటా తొలకరితో పాటు
సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వర్షాలు పుష్కలంగా కురిసేవి. రిజర్వాయర్లు, చెరువులు
నిండి భూగర్భ జలాలు పెరిగేవి. ప్రస్తుతం ఈ ఏడాదంతా వర్షాలు లేకపోవడంతో కరువు విలయతాండవం చేస్తోంది. రిజర్వాయర్లు ఖాళీ అవుతుండగా.. భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. ప్రస్తుత నీటిమట్టం చూస్తుంటే మూడు నెలల వరకు ఏదో విధంగా నేటికొచ్చే
పరిస్థితులు కనిపిస్తున్నాయి. వేసవి, అంతకంటే ముందే నీటి ఎద్దడిని ఎదుర్కోకక తప్పేలా లేదు. 2003కి ముందు పరిస్థితులు మరోసారి
ఎదురయ్యేలా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తిరుపతి తుడా: జిల్లాకు జలగండం తప్పేలా లేదు. ఈ ఏడాదంతా వర్షాలు ముఖం చాటేయడంతో కరువు ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సాగునీరు అటుంచితే తాగేందుకూ తిప్పలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాతావరణశాఖ హెచ్చరికలను కూటమి ప్రభుత్వం విస్మరించడం, ముందస్తు నీటి నిల్వలపై దృష్టి సారించకపోవడంపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు.
తిరుపతికి జలగండం తప్పదా?
తిరుపతిలో ఐదు లక్షల జనాభా ఉండగా.. విద్య, వైద్య పరంగా అనేక ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు నెలకొన్నాయి. తిరుపతి యాత్ర స్థలం కావడంతో మరో 80 వేల మంది రాకపోకలు సాగిస్తుంటారు. ఇలాంటి ముఖ్య నగరమైన తిరుపతికి కై లాసగిరి, కళ్యాణి డ్యామ్ రిజర్వాయర్లు మాత్రమే ప్రధాన నీటి వనరుగా ఉన్నాయి. ‘ఎల్లో’ నినో ప్రభావంతో వర్షపాతం భారీగా పడిపోవడంతో ఉన్న రెండు రిజర్వాయర్లలో నీటి నిల్వలు తగ్గుముఖం పట్టాయి. రోజూ నీటి సరఫరా చేసే పరిస్థితులు లేవు. రెండు రోజుల తర్వాత, కొన్ని ప్రాంతాల్లో నాలుగు రోజులకు ఒకసారి నీటిని సరఫరా చేస్తున్నారు. మరో మూడు నెలల్లో రిజర్వాయర్లు పూర్తిగా ఖాళీ అయ్యే ప్రమాదం కనిపిస్తోంది. తిరుపతి పట్టణంలోని భూగర్భ జలాలు సైతం గణనీయంగా పడిపోయాయి. ఈ క్రమంలో వచ్చే వేసవికి ముందే తిరుపతి ప్రజలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కోక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తాగినీటికి తిప్పలు
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ సరఫరా చేసే నీటి ట్యాంకులు వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. రూ.400 నుంచి రూ.450 వెచ్చించి వాటర్ ట్యాంకులను కొనుగోలు చేస్తున్నారు.
వెంకటగిరిలో దాహం దాహం
వెంకటగిరి రూరల్ : వెంకటగిరి మున్సిపాలిటీలో రెండు రోజులకోసారి నీటిని విడుదల చేస్తున్నారు. ఓ వైపు పైపు లైన్ల లీకేజీ, మరో వైపు తెలుగుగంగ నీటిని నిలుపుదల చేయడంతో తాగునీటి సమస్య ఏర్పడింది. నేదురుమల్లి రాజ్యలక్ష్మమ్మ వెంకటగిరి ఎమ్మెల్యే, మంత్రిగా ఉన్న హయాంలో వెంకటగిరి సమీపంలోని చింతగుంట గ్రామం వద్ద సమ్మర్స్టోరేజ్ ట్యాంక్ను ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి తెలుగు గంగ నీటిని ఫ్యూరిఫైడ్ చేసి పుర ప్రజలకు అందించేవారు. కాలానుగుణంగా పైప్లైన్లు దెబ్బతినడం, లీకేజీ కారణంగా రోజూ మరమ్మతులు చేయాల్సి వస్తోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సమన్వయకర్త నేదురుమల్లిరామ్కుమార్రెడ్డి రూ.102 కోట్లతో అమృత 2.0ను తీసుకొచ్చి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ సామర్థ్యం పెంచడంతోపాటు ఆధునిక పైప్లైన్ ఏర్పాటుచేసి, ప్రతి ఇంటికీ తాగునీటిని సరఫరా చేసేందుకు కృషి చేశారు. ఆపై ప్రభుత్వం మారడంతో ఆ నిధులు మురిగిపోయే విధంగా స్థానిక నాయకులు వ్యవహరిస్తున్నారు.
ముందస్తు చర్యలు శూన్యం
ఎల్నినో ప్రభావం ఉంటుందని తెలిసినా ప్రభుత్వం గానీ, అధికార యంత్రాంగం గానీ ముందస్తు చర్యలపై దృష్టి సాధించలేదు. ముందుగానే అందుబాటులో ఉన్న నీటి నిల్వలను పొదుపుగా వాడుకోవడం, కై లాసగిరి రిజర్వాయర్కు తెలుగు గంగ ద్వారా నీటిని నింపడం వంటి చర్యలు చేపట్టలేకపోయారు. తిరుపతిలో 300 అడుగుల లోతులో ఉన్న నీరు ప్రస్తుతం 500 అడుగలకు చేరిందని అధికారులు చెబుతున్నారు. వర్షాలు లేక ఇదే పరిస్థితులు ఎదురైతే వేసవినాటికి తిరుపతిలో తీవ్ర నీటి సమస్య ఎదురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


