తిరుపతి అన్నమయ్యసర్కిల్: స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో వెంకటగిరి నియోజకవర్గ జనసేన పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకటేశ్వరావు తన సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. గురువారం ఆయన తిరుపతి ప్రెస్క్లబ్లో మీడియాతో మాట్లాడారు. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి క్రియాశీలకంగా పనిచేస్తునే ఎన్నో అవమానాలు భరించానన్నారు. నెల్లూరు జిల్లా జనసేన ప్రధాన కార్యదర్శిగా పదేళ్లుగా పనిచేసినట్లు తెలిపారు. పార్టీ సిద్ధాంతాలు నమ్మి జనసేన పార్టీలో చేరానన్నారు. కులమతాలు లేవు, కులాలు మధ్య ఐక్యత అంటూ పవన్కళ్యాణ్ చెప్పిన మాటలు నమ్మి మోసపోయానంటూ వాపోయారు. వెంకటగిరి నియోజకవర్గంలో మొట్టమొదటి సభ్యత్వం తనదేనన్నారు. 2024లో జనసేన పార్టీ తరఫున వెంకటగిరి నియోజకవర్గ టికెట్ ఆశించి భంగపాటుకు గురైనట్లు చెప్పారు. నాగబాబు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నావంటూ 15 రోజుల పాటు తనపై సస్పెన్షన్ వేటు వేశారని గుర్తు చేశారు.


