రాజంపేట, వాకాడు, కోట, కలువాయి నుంచి తిరుపతి, నెల్లూరు, తమిళనాడు, కర్ణాటకకు రవాణా అదనపు లోడుతో వెళ్లే వాహనాలే మాఫియా టార్గెట్ మూడు టోల్ ప్లాజాల వద్ద ప్రైవేటు సిబ్బంది కాపలా ఒక్కో టిప్పర్ నుంచి రూ.50 వేలు వసూలు రోజుకి 200 వాహనాల నుంచి పిండుకుంటున్న వైనం ఎమ్మెల్యేల బినామీల వాహనాల జోలికి వెళ్లకుండా జాగ్రత్తలు కోట్ల రూపాయలు జేబులు నింపుకుంటున్న టీడీపీ ఎమ్మెల్యేలు, అధికారులు
ఇసుక డిమాండ్‌ని దృష్టిలో ఉంచుకుని మాఫియా రెచ్చిపోతోంది. రాజంపేట, కలువాయి, కోట, వాకాడులో అనధికారిక రీచ్‌లు ఏర్పాటు చేసి.. అక్కడి నుంచి తిరుపతి, నెల్లూరు, తమిళనాడు, కర్ణాటకకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. మరో వైపు డమ్మీ బిల్లులు, బిల్లులు లేకుండా అదనపు లోడుతో వెళ్లే వాహనదారులను బెదిరించి భారీగా వసూళ్లు చేసుకుంటున్నారు. ఇందు కోసం టోల్ ప్లాజాల వద్ద ప్రైవేటు సిబ్బందితో కాపలా పెట్టి, ఒక్కో టిప్పర్ నుంచి భారీగా మామూళ్లు దండుకుంటున్నారు. ఆలా రోజుకు సుమారు 200 వాహనాల నుంచి మాఫియా డబ్బులు వసూలు చేస్తోంది. అధికార పార్టీ నాయకులకు చెందిన టిప్పర్ల జోలికి మాత్రం వెళ్లడం లేదు. ఏడాదిన్నరగా సాగుతున్న మైనింగ్ మాఫియాపై ‘సాక్షి’ పరిశోధనాత్మక కథనం.
సాక్షి ప్రతినిధి, తిరుపతి: చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక.. ఇసుక ఉచితం అని ప్రకటించిన విషయం తెలిసిందే. పేరుకు ఉచితమే కానీ.. ఇసుక తోడుకోవాలంటే అధికార పార్టీ నేతలకు కప్పం ఇస్తూ జేబులు నింపాల్సి వచ్చింది. ఆ తరువాత కొన్నాళ్లకు ప్రభుత్వం అక్కడక్కడ రీచ్‌లు ఏర్పాటు చేసి.. ఇసుకను విక్రయించడం ప్రారంభించింది. మరో వైపు టీడీపీ నేతలు ఉచితం పేరు చెప్పి తిరుపతి, చిత్తూరు జిల్లాల పరిధిలోని నదులు, వాగులు, వంకల్లోని ఇసుకను భారీ యంత్రాలతో తోడి అక్రమంగా తరలించి సొమ్ము చేసుకోవడం ఆరంభించారు. అలా రెండేళ్ల కాలంలో నదులు, వాగులు, వంకల్లోని ఇసుకను పూర్తిగా తోడి అమ్మి సొమ్ము చేసుకున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ఇసుక కొతర తీవ్రంగా ఉంది.
రీచ్‌ల వద్ద ఆ వాహనాలు కప్పం చెల్లించాల్సి
అనధికారికంగా ఏర్పాటు చేసిన రీచ్‌ల వద్ద వ్యాపారులు కొందరు ఇసుక నింపుకున్నాక మాపియా నియమించిన వారికి కప్పం చెల్లించాలి. ఒక టిప్పర్‌కి రూ.12 వేలు చొప్పున వసూలు చేస్తున్నారు. కప్పం చెల్లించినట్టు ఎటువంటి బిల్లులు ఇవ్వరు. టిప్పర్ నిండా ఎంతైనా ఇసుక నింపుకోవచ్చు. రీచ్‌ల వద్ద నిబంధనలేవీ పట్టించుకోరు.
ఇక్కడ మరో రకమైన దందా
మైనింగ్ మాఫియాకు చెందిన వాహనాలకు బిల్లు లు ఉండవు. ఈ వాహనాలకు తనిఖీలు ఉండవు. పొరబాటున ఎవరైనా తనిఖీ చేస్తే.. వారికి నేరుగా ఎమ్మెల్యే లేదా ఉన్నతాధికారుల నుంచి ఫోన్లు వెళ్తాయి. ఇదిలా ఉంటే.. రీచ్‌లలో ఇసుక నింపుకుని వెళ్లే వ్యాపారుల వాహనాలకు డమ్మీ బిల్లులు ఇస్తున్నారు. ఈ వాహనాలే లక్ష్యంగా మైనింగ్ మాఫియా మరో రకమైన దందాకు తెరదీసింది. రీచ్‌ల నుంచి వెళ్లే ఇసుక వ్యాపారుల టిప్పర్లే లక్ష్యంగా ఆ వాహనాలు వెళ్లే మార్గాల్లో టోల్ ప్లాజాల వద్ద మాఫియా ప్రైవేటు సిబ్బందిని కాపలాగా నియ మించింది. వారు అదనపు లోడు, డమ్మీ బిల్లులతో వెళ్లే టిప్పర్లను అడ్డగిస్తారు. డమ్మీ బిల్లులు అని, నిబంధనలకు విరుద్ధంగా ఇసుక నింపుకుని వెళ్తున్నావంటూ హడావుడిచేసి బెదిరిస్తారు. భయపడి అడిగినంత సమర్పించుకుని వెళ్తున్నారు. అలా ఒక్కో వాహనం నుంచి రూ.50వేల చొప్పున వసూలు చేస్తున్నట్టు ఇసుక వ్యాపారి ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు. అలా రోజుకు సుమారు 200 వాహనాల నుంచి అక్రమ వసూళ్లు చేస్తూ కోట్ల రూపాయలు జేబులు నింపుకుంటున్నారని వెల్లడించారు.
మాఫియాకు కాసుల వర్షం
తిరుపతి కేంద్రంగా ఇసుక లావాదేవీలు
తిరుపతి మహానగరంలో ప్రభుత్వ, ప్రైవేటు నిర్మా ణాల కోసమే ప్రతి రోజూ సుమారు 300 నుంచి 400 టిప్పర్ల ఇసుక అవసరమవుతోందని అంచనా. ఇంకా శ్రీకాళహస్తి, చంద్రగిరి, చిత్తూరు పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న నిర్మాణాల కోసం మరో 500 టిప్పర్ల ఇసుక అవసరం. ఇంకా ముఖ్యంగా తమిళనాడులోని చైన్నె, కర్ణాటకలోని బెంగళూరులో ఇసుకకు మరింత డిమాండ్ ఉండడంతో కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు, ఇద్దరు ఉన్నతాధికారులు, రెవెన్యూ, మైనింగ్, ఇరిగేషన్, పోలీసులు కొందరు ఏకమయ్యారు. ఇసుక లభ్యమయ్యే ప్రాంతాలను గుర్తించారు. పక్క జిల్లాలైన వైఎస్సార్ కడపలోని రాజంపేట, వెంకటగిరి పరిధిలోని కలువాయి, నెల్లూరు పరిధిలోని కోట, తిరుపతి జిల్లా వాకాడు పరిధిలో ఇసుక సమృద్ధిగా లభ్యమవుతోంది. సోమశిల రిజర్వాయర్ కింది భాగంలో, స్వర్ణముఖి నదిలో ఇసుకను తోడేస్తున్నారు. అక్రమంగా తోడేస్తున్న ఇసుకను రాజంపేట, వెంకటగిరి, కలువాయి, కోట, వాకాడు పరిధిలో అనధికారిక రీచ్‌లు ఏర్పాటు చేసుకున్నారు. పైకి మాత్రం అధికారిక రీచ్‌లు అని చెబుతున్నారు. ఈ రీచ్‌ల నుంచి టీడీపీ ఎమ్మెల్యేలు, అధికారులు కుమ్ముకై ్క ఇసుక వివిధ ప్రాంతాలకు తరలించి కోట్ల రూపాయలు దండుకుంటున్నారు.


