చంద్రగిరి: చంద్రగిరిలో ఏదో ఒక ప్రాంతంలో గంజాయి బ్యాచ్ ఆగడాలు శ్రుతిమించుతూనే ఉన్నా యి. ఇంటి ముందు విందు కోసం ఏర్పాటు చేసిన షామియానాపై వివాదం చేసి గంజాయి బ్యాచ్ నవ వరుడిపై దాడి చేయడంతో పాటు ఇంటి ముందు ఉన్న షామియానా ధ్వంసం చేసింది. దాడిలో యువకుడికి రక్తగాయాలు కాగా పోలీసులకు ఫిర్యాదు చేసినా, ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడంపై బాధితులు ఆందోళన చెందుతున్నారు. బాధితుల వివరాల మేరకు.. మండలంలోని రంగంపేట పంచాయతీ, దర్శిపల్లికి చెందిన జయంత్‌కుమార్ ఓ మెడికల్ ఏజెన్సీలో పనిచేస్తున్నాడు. ఇటీవల జయంత్‌కుమార్‌కు వివాహం జరిగింది. ఈ క్రమంలో ఈ నెల 13వ తేదీన తన ఇంటి వద్ద విందు ఏర్పాటు చేశారు. 12వ తేదీ రాత్రి గ్రామానికి కొంతమంది యువకులు మద్యం, గంజాయి సేవించి వచ్చారు. షామియానా తీసివేయాలంటూ గొడవకు దిగారు. విందు కార్యక్రమం అవ్వగానే తీసివేస్తామని చెప్పినా వినకుండా, వారు షామియానాను ధ్వంసం చేసేందుకు యత్నించారు. వారిని అడ్డుకునే క్రమంలో జయంత్‌కుమార్‌పై గంజాయి బ్యాచ్ కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడింది. దీంతో జయంత్ చెవికి తీవ్ర గాయమైంది. అనంతరం గ్రామంలో యువకులు వేసిన వినాయక మండపాన్ని సైతం ధ్వంసం చేసి హల్‌చల్ చేశారు. బాధితుడు రక్తగాయాలతో తిరుపతి రుయాకు వెళ్లి చికిత్స చేయింకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నెల 14వ తేదీన ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గంజాయి బ్యాచ్‌కు స్థానికంగా ఉండే అధికార పార్టీ నేతల అండ ఉండడంతోనే చర్యలు తీసుకోవడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు.


