తిరుమల : శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల ఆన్‌లైన్ బుకింగ్‌పై భక్తుల్లో వ్యక్తమవుతున్న సందేహాలకు టీటీడీ వివరణ ఇచ్చింది. భారీ డిమాండ్ కారణంగానే టికెట్ల బుకింగ్‌లో తీవ్ర పోటీ నెలకొంటోందని, ఆన్‌లైన్ బుకింగ్ వ్యవస్థ పటిష్టంగా పనిచేస్తోందని స్పష్టం చేసింది. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని భక్తులకు విజ్ఞప్తి చేసింది.
పరిశీలించాలి
ఆన్‌లైన్ చెల్లింపుల ప్రక్రియ టీటీడీ బుకింగ్ వ్యవస్థతో పాటు చెల్లింపు సంస్థలు, బ్యాంకింగ్ నెట్‌వర్క్‌లు, యూపీఐ వ్యవస్థలపై కూడా ఆధారపడి ఉంటుందని తెలిపింది. అందువల్ల ఏదైనా లావాదేవీ విఫలమైనప్పుడు సమస్య ఏ దశలో ఏర్పడిందో పరిశీలించాల్సి ఉంటుందని వివరించింది.
మరింత బలోపేతం
భక్తుల సూచనలు పరిగణనలోకి తీసుకుని ఆన్‌లైన్ బుకింగ్, అప్లికేషన్, డేటాబేస్ పనితీరు, అధిక రద్దీని నిర్వహించే సామర్థ్యం, భద్రత, బాట్‌ల నియంత్రణ, చెల్లింపుల ప్రక్రియ తదితర అంశాల్లో నిరంతరం సాంకేతిక అభివృద్ధి చేపడుతున్నట్లు టీటీడీ తెలిపింది. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీ కల్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం, శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయం తదితర ఆలయాల దర్శన, సేవా టికెట్లను కూడా ఇదే ఆన్‌లైన్ విధానంలో విడుదల చేస్తున్నామని తెలిపింది.
కోటాతో పోలిస్తే
9 రెట్లు అధిక డిమాండ్
అధిక డిమాండ్ ఉన్న సమయంలో సుమారు 6 లక్షల మంది వినియోగదారులు టికెట్ల కోసం ఒకేసారి ప్రయత్నిస్తున్నారని టీటీడీ తెలిపింది. ఒక్కో వ్యక్తి సగటున నలుగురు కుటుంబ సభ్యుల కోసం టికెట్లు పొందేందుకు ప్రయత్నిస్తే సుమారు 24 లక్షల టికెట్లకు డిమాండ్ ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. అయితే అందుబాటులో ఉన్న కోటా సుమారు 2.69 లక్షల టికెట్లు మాత్రమేనని తెలిపింది. అందుబాటులో ఉన్న టికెట్లతో పోలిస్తే డిమాండ్ దాదాపు 9 రెట్లు అధికంగా ఉండడంతో ఒకే సమయంలో వేలాది మంది ఒకే దర్శన సమ యానికి ప్రయత్నిస్తున్నారని వివరించింది.


