కృత్రిమ మేధస్సుతో వ్యవసాయం | - | Sakshi
Sakshi News home page

కృత్రిమ మేధస్సుతో వ్యవసాయం

Sep 27 2026 4:10 AM | Updated on Sep 27 2026 4:10 AM

నారాయణవనం: సాంకేతికతను అందిపుచ్చుకుని, కృత్రిమ మేధస్సుతో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పరచడంలో యువ ఇంజినీర్లు శ్రద్ధ చూపాలని తిరుపతి రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ సీఈవో విజయవంత్‌ మాథుర్‌ సూచించారు. సిద్ధార్థ ఇన్‌న్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ కళాశాలలో ‘వ్యవసాయం, ఆహార వ్యవస్థల్లో కృత్రిమ మేధస్సు ప్రాథమిక అంశాలు, అనువర్తనాలు, భవిష్యత్‌ అవకాశాలు’ అంశంపై మూడు రోజుల వర్క్‌షాప్‌ శనివారం ముగిసింది. ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడుల నుంచి ఎంపికై న 60 మంది విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. స్మార్ట్‌ ఫార్మింగ్‌, డిజిటల్‌ వ్యవసాయం, జనరేటివ్‌ ఏఐ, మొక్కల వ్యాధుల గుర్తింపులో డీప్‌ లెర్నింగ్‌, డ్రోన్లు–రోబోటిక్స్‌, పంట దిగుబడి అంచనా, వాతావరణ అనుకూల సాగు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఆహార నాణ్యత అంచనా, భద్రత, ఏఐ ఆధారిత తనిఖీ పద్ధతులు, నేల–నీటి వనరుల నిర్వహణపై సెషన్లు నిర్వహించారు. శనివారం జరిగిన సెమీనార్‌లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న విజయవంత్‌ మాథుర్‌ మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో ఏఐ ఆధారిత స్టార్టప్‌లు, ఆవిష్కరణలు, భవిష్యత్‌ అవకాశాలపై దృష్టి సారించాలన్నారు. విద్యా సంస్థలు, పరిశ్రమలు, స్టార్టప్‌ల సమన్వయంతో వ్యవసాయరంగంలో సాంకేతిక పరిష్కారాలను మరింత విస్తృతంగా అందుబాటులోకి తీసురావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రాంతీయ భాషలో సాంకేతిక విద్యను మరింత చేరువ చేయడం, వ్యవసాయ–ఆహార రంగాల్లో ఏఐ ఆధారిత పరిశోధనలు, ఆవిష్కరణలను ప్రోత్సహించడంపై ఇంజినీరింగ్‌ కళాశాలలు శ్రద్ధ చూపాలని చెప్పారు. కళాశాల ప్రిన్సిపాళ్లు రమేష్‌కుమార్‌, జనార్ధనరాజు, వైస్‌ ప్రిన్సిపల్‌ మధు, ప్రోగ్రాం కన్వీనర్‌ మల్లిక, కో–ఆర్డినేటర్‌ నాగరాజు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement