బైరెడ్డిపల్లె : పలమనేరు– కుప్పం జాతీయ రహదారిలోని దేవదొడ్డి సమీపంలో మలుపు వద్ద మంగళవారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో వి.కోట పంచాయతీ బిల్‌కలెక్టర్ సాధిక్‌ఆలీ (49) మృతి చెందాడు. వివరాలు.. బైరెడ్డిపల్లెకు చెందిన నజీర్‌బాషా కుమారుడు సాధిక్‌ఆలీ వి.కోట పంచాయితీలో బిల్‌కలెక్టర్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం విధులకు హాజరై ద్విచక్రవాహనంపై తిరిగి ఇంటికి వస్తుండగా ఐషర్ వాహనం ఢీ కొంది. దీంతో తీవ్రంగా గాయపడిన సాధిక్ ఆలీని 108 వాహనంలో పలమనేరు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మరణించాడు. ప్రమాదానికి కారణమైన ఐషర్ డ్రైవర్ పరారయ్యాడు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. నెల రోజుల క్రితం మృతుడి తండ్రి రోడ్డు ప్రమాదంలో కన్నుమూశాడు. సాధిక్ మృతితో బైరెడ్డిపల్లెలో విషాదఛాయలు అలుముకున్నాయి. బైరెడ్డిపల్లె పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మహిళా వర్సిటీకి జాతీయ స్థాయిలో గౌరవం
తిరుపతి రూరల్: పరిశోధనలు, సాంకేతిక ఆవిష్కరణల రంగంలో శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం లభించింది. భారత ప్రభుత్వ శాసీ్త్రయ, పారిశ్రామిక పరిశోధన విభాగం (డీఎస్‌ఐఆర్) ఆధ్వర్యంలో జూన్–2026లో నిర్వహించిన టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ సపోర్ట్ సెంటర్ (టీఓసీఐసీ) వార్షిక కార్యకలాపాల సమీక్షలో శ్రీపద్మావతీ మహిళా యూనివర్సిటీకి అత్యున్నత ‘ఎక్స్‌లెంట్’ ర్యాంకు లభించింది. దేశవ్యాప్తంగా టెక్నాలజీ, ఇన్నోవేషన్, పరిశోధనల ప్రోత్సాహంలో విశిష్ట పనితీరు కనబరిచిన సంస్థలకు మాత్రమే ఈ గుర్తింపు దక్కడం విశేషం. న్యూఢిల్లీలోని డీఎస్‌ఐఆర్–ప్రిజమ్ విడుదల చేసిన సమావేశ నిర్ణయాల ప్రతిని టీఓసీఐసీ సమన్వయకర్త ఆచార్య పి.జ్యోత్స్న, సహ సమన్వయకర్త డా.డి. సుజాత విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఉమ, రిజిస్ట్రార్ ఆర్.ఉషాకు సోమవారం అందజేశారు. టీఓసీఐసీ ద్వారా వినూత్న ఆలోచనలతో ముందుకు వచ్చే విద్యార్థులు, పరిశోధకులు, స్టార్టప్‌లు, పారిశ్రామికవేత్తలకు వారి ప్రాజెక్టుల స్వభావాన్ని బట్టి రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయం అందే అవకాశముందని సమన్వయకర్తలు తెలిపారు.


