శ్రీకాళహస్తి రూరల్: తల్లికి వందనం డబ్బులు ఇవ్వలేదనే కక్షతో అత్త ఉంటున్న ఇంటిని అల్లుడు ధ్వంసం చేసిన ఘటన మండలంలోని పెంకులపాడులో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం.. పెంకులపాడు గ్రామానికి చెందిన వాణి అంగన్‌వాడీ కార్యకర్త. ఆమె కుమార్తె మౌనికను 2013లో బుచ్చినాయుడుకండ్రిగ మండలం, జంబుగోళం గ్రామానికి చెందిన పీ.కిరణ్‌కు ఇచ్చి వివాహం జరిపించింది. వీరికి హేమశ్ర, కమల్ పిల్లలు ఉన్నారు. రెండేళ్లుగా వేరేమహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న కిరణ్ భార్యను పట్టించుకునేవాడు కాదు. దీంతో ఆమె పుట్టింటికి చేరింది. కమల్ తన తండ్రి వద్దే ఉంటూ చదువుకుంటుండగా.. హేమశ్రీ తన తల్లితోపాటు ఉంటోంది. నాలుగు రోజుల క్రితం కిరణ్ తండ్రి జానకీరామయ్య తన మనమరాలు హేమశ్రీకి ఫోన్ చేసి తల్లికి వందనం డబ్బులు ఇవ్వాలని అడిగాడు. దానికి కోడలు ఒప్పుకోకపోవడంతో భర్త కిరణ్ ఆగ్రహించి మంగళవారం పెంకులపాడుకు చేరుకున్నాడు. ఇంటి వద్ద ఎవ్వరూ లేకపోవడంతో ఇంటి కిటికీలకు అమర్చిన అద్దాలు పూర్తిగా ధ్వంసం చేశాడు. కరెంటు మీటరు, స్వీచ్ బాక్సులు పగులగొట్టాడు. అత్త వాణి ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ ఇబ్రహీం తెలిపారు.


