ఇక ఎప్పుడు అనుమతులొస్తాయి సార్
కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్‌కు 324 అర్జీలు
తిరుపతి అర్బన్: అయ్యా.. పింఛన్ ఇప్పిచి ఆదుకోండి. రెండేళ్లుగా తిరుగుతున్నా అనుమతి రాలేదంటూ వాయిదా వేస్తున్నారు.. ఇంకెప్పుడు మేం చచ్చిపోయిన తర్వాత అనుమతి వస్తుందా...?’ అంటూ పలువురు అభాగ్యులు అధికారులను నిలదీశారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు 324 అర్జీలు వచ్చాయి. కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్‌తోపాటు జాయింట్ కలెక్టర్ గోవిందరావు, డీఆర్వో నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శివశంకర్‌నాయక్, భరత్‌నాయక్, రోజ్‌మాండ్, నాగార్జునతో కలసి అర్జీలను స్వీకరించారు. రెవెన్యూ సమస్యలపై 177 అర్జీలు వచ్చాయి.
పింఛన్లకు అనుమతులెప్పుడొస్తాయి సర్
నాకు రెండు కాళ్లు సక్రమంగా పనిచేయవు. పింఛన్ కోసం ఆరు నెలలుగా తిరుగుతూనే ఉన్నాను. నాకు 90 శాతం వికలత్వం ఉంది. దరఖాస్తులకు అనుమతులొస్తే చెబుతామన్నారు. వాటికి ఏమైనా అనుమతులు వచ్చాయా సార్.. పేద కుటుంబానికి చెందిన వాళ్లం. మాకు సాయం చేయండి సార్.
–ఎడ్ల నాగరాజు, దివ్యాంగుడు, కుంట్రపాకం
ప్రభుత్వ స్థలాలు ఆక్రమించేస్తున్నారు
వెంకటగిరిలో ప్రభుత్వ స్థలాలు దర్జాగా ఆక్రమించుకుంటున్నారు. అయినా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రధానంగా ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల వెనుకవైపు ఉన్న సమితి స్థలాన్ని ఆక్రమించారు. అలాగే వెంకటగిరి అడ్డరోడ్డులో ఆర్టీసీ డిపోకు సమీపంలోని స్థలాన్ని ఆక్రమించారు. విలువైన ప్రభుత్వ స్థలాలను కాపాడాలి.
– వెంకటరమణారెడ్డి, వెంకటగిరి
రెండేళ్లుగా అనుమతులు రాలేదంటూ వాయిదాలేనా?


