డిజిటల్‌ సమ్మిళితతే కీలకం | - | Sakshi
Sakshi News home page

డిజిటల్‌ సమ్మిళితతే కీలకం

Jul 28 2026 1:48 AM | Updated on Jul 28 2026 1:48 AM

తిరుపతి రూరల్‌: మహిళల సాధికారతను, సుస్థిర ఆర్థికాభివృద్ధికి డిజిటల్‌ సమ్మిళితత కీలకమని, దానిని జీవితాంత విద్యతో అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందని యూజీసీ కమిషన్‌ (యూజీసీ) సంయుక్త కార్యదర్శి డాక్టర్‌ ఆషిమా మంగ్లా పేర్కొన్నారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం మహిళా అధ్యయన కేంద్రం, న్యూఢిల్లీకి చెందిన ఇండియన్‌ అడల్ట్‌ ఎడ్యుకేషన్‌ అసోసియేషన్‌, తిరుపతి సర్వోదయ మహిళా సంక్షేమ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ‘సుస్థిర అభివృద్ధి కోసం మహిళల డిజిటల్‌ సమ్మిళితతకు జీవితాంత విద్య – సమస్యలు, వ్యూహాలు’ అన్న అంశంపై సోమవారం ప్రారంభమైన రెండు రోజుల జాతీయ సదస్సులో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలకు డిజిటల్‌ పరిజ్ఞానం, నైపుణ్యాలు, అవకాశాలు కల్పించగలిగితే కుటుంబం నుంచి దేశాభివృద్ధి వరకు సానుకూల మార్పు సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ఇండియన్‌ అడల్ట్‌ ఎడ్యుకేషన్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ ఎల్‌.రాజా మాట్లాడుతూ డిజిటల్‌ సాంకేతికత మహిళల దైనందిన జీవితంలో విడదీయరాని భాగమైందన్నారు. సదస్సుకు అధ్యక్షత వహించిన మహిళా అధ్యయన కేంద్రం డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ పి. విజయలక్ష్మి మాట్లాడుతూ మహిళా సాధికారతకు డిజిటల్‌ సమ్మిళితత ప్రధాన చోదకశక్తిగా మారిందన్నారు. సదస్సులో డైరెక్టర్‌ డాక్టర్‌ డి.ఉమాదేవి, సమన్వయకర్త ప్రొఫెసర్‌ పి.ఆదినారాయణరెడ్డితో పాటు దేశవ్యాప్తంగా ఢిల్లీ, కాలికట్‌, తిరువనంతపురం, కోల్‌కతా, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన అధ్యాపకులు, పరిశోధకులు, మహిళా అధ్యయన కేంద్రాల ప్రతినిధులు పాల్గొన్నారు. రెండు రోజులు పాటు జరిగే సదస్సులో మొత్తం 56 పరిశోధనా పత్రాల ప్రదర్శనతో మహిళల డిజిటల్‌ సాధికారత, జీవితాంత విద్య, సుస్థిర అభివృద్ధికి సంబంధించిన అంశాలపై విస్తృత చర్చలు జరగనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement