శ్రీవారి దర్శనానికి 24 గంటలు | - | Sakshi
Sakshi News home page

శ్రీవారి దర్శనానికి 24 గంటలు

Jul 26 2026 7:48 AM | Updated on Jul 26 2026 7:48 AM

తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్‌ శిలాతోరణం వద్దకు చేరుకుంది. శుక్రవారం అర్ధరాత్రి వరకు 78,721 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 38,018 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.98 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది.

6న టీటీడీ మిక్సిడ్‌ రైస్‌ ఈ–వేలం

తిరుపతి అన్నమయ్యసర్కిల్‌: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాల్లో భక్తులు హుండీల ద్వారా సమర్పించిన బియ్యాన్ని ఆగస్టు 6న ఈ–వేలం ద్వారా విక్రయించనున్నట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ వేలంలో మొత్తం 20 లాట్లలో సుమారు 7,938 కిలోల మిక్సిడ్‌ రైస్‌ అందుబాటులో ఉంచనున్నారు. ఆసక్తి కలిగిన వారు ఆగస్ట 5వ తేదీ సాయంత్రం లోపు కొనుగోలు పోర్టల్‌ ద్వారా రూ.50 వేల ఈఎండీ ఆన్‌న్‌లైనన్‌లో చెల్లించాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్‌ కార్యాలయాన్ని కార్యాలయ వేళల్లో లేదా ఫోన్‌ 0877–2264429 లేదా టీటీడీ కొనుగోలు వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని పేర్కొంది.

ఆర్టీసీ డ్రైవర్లకు కౌన్సెలింగ్‌

తిరుపతి అన్నమయ్యసర్కిల్‌: ప్రమాదరహిత వారోత్సవాలను పురస్కరించుకుని శనివారం జిల్లా ప్రజా రవాణా అధికారి కార్యాలయంలో పది డిపోలకు చెందిన ఆర్టీసీ డ్రైవర్లకు కౌన్సెలింగ్‌ ప్రక్రియ నిర్వహించారు. టీపీటీవో జగదీష్‌ మాట్లాడుతూ గతంలో జరిగిన ప్రమాదాలపై సమగ్ర విశ్లేషణ చేసి, ప్రమాదాలకు దారితీసే ప్రధాన కారణాలపై ఆరా తీశారు. కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ పి.విశ్వనాథ్‌, ఆర్‌ఎస్‌డీ గోపాల్‌ పాల్గొన్నారు.

ఓపెన్‌ కాని వెబ్‌ఆప్షన్‌ సైట్‌

తిరుపతి సిటీ: వెబ్‌ ఆప్లన్లా...అయ్యో రామచంద్రా ఏమి చెప్పాలి..? అంటూ ఏపీఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్‌ చేసుకున్న విద్యార్థులు, తల్లి దండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఈఏపీసెట్‌– 2026 కౌన్సెలింగ్‌లో భాగంగా సాంకేతిక విద్యామండలి శనివారం నుంచి వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియకు అవకాశం కల్పించింది. కాగా జిల్లా వ్యాప్తంగా రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసుకున్న 20 వేల మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఇంటర్నెట్‌ సెంటర్ల వద్ద, సచివాలయాల వద్ద, కౌన్సెలింగ్‌ సెంటర్ల వద్ద పడిగాపులు కాశారు. రాత్రి 7గంటల అవుతున్నా వెబ్‌ సైట్‌ ఓపెన్‌ కాలేదని తెలిపారు.

ఏమిటీ నిర్లక్ష్యం...

ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలోనూ విద్యార్థులకు నరకం చూపించిన ఉన్నత విద్యామండలి అధికారులు వెబ్‌ఆప్షన్ల ప్రక్రియలోనే ఆదే తంతును కొనసాగిస్తున్నారు. ఈనెల 25 నుంచి 31వ తేదీ వరకు వెబ్‌ఆప్షన్ల ప్రక్రియ కొనసాగుతుందని, విద్యార్థులు వెంటనే ఆప్షన్లను నమోదు చేసుకోవాలని ప్రకటించారు. కానీ వెబ్‌సైట్‌ ఓపెన్‌ కాకపోవడంతో తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement