తిరుపతి క్రైం: తిరుపతి టౌన్‌క్లబ్ కాంపౌండ్‌లో ఉన్న ఆర్‌కే.మీట్ హోటల్‌లో శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు బీభత్సం సృష్టించారు. హోటల్ వెనుక గోడను పగులగొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులు టేబుళ్లు, కుర్చీలు, ఫర్నిచర్‌తో పాటు ఇతర సామగ్రిని ధ్వంసం చేశారు. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు హోటల్ నిర్వాహకులు తెలిపారు. ఘటనపై తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. హోటల్‌లో ఆస్తులను ధ్వంసం చేయడమే లక్ష్యంగా దాడి జరిగినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. దీని వెనుక టౌన్ క్లబ్ ప్రస్తుత యాజమాన్యం ప్రమేయం ఉండొచ్చని ఆరోపిస్తూ విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
టీడీఆర్ బాండ్లతో వివాదం
ఈ ఘటనపై స్పందించిన టౌన్ క్లబ్ సభ్యుడు, టీడీపీ నాయకు డు బుల్లెట్ రమణ మాట్లాడుతూ.. రోడ్డు విస్తరణ పనుల కోసం టౌన్ క్లబ్‌కు ఇటీవల రూ.1.08 కోట్ల విలువైన టీడీఆర్ బాండ్లు మంజూరైన తర్వాత వివాదం చెలరేగిందన్నారు. గత 25–30 ఏళ్లుగా క్లబ్ క్యాంటీన్ నిర్వహిస్తున్న ఆర్.కె.రామకృష్ణారెడ్డిని ఖాళీ చేయించాలని కొందరు ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. ఈ అంశాన్ని జనరల్ బాడీలో చర్చించగా, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేదా సభ్యుల ఏకాభిప్రాయం లేకుండా ఖాళీ చేయించవద్దని మెజారిటీ నిర్ణయించినప్పటికీ, ఎలాంటి స్పష్టత లేకుండానే క్లబ్ భవనాన్ని కూల్చివేశారని విమర్శించారు. బీజేపీ, టీడీపీ, జనసేన, వైఎస్సార్‌సీపీ, కమ్యూనిస్టు పార్టీలకు చెందిన ప్రముఖులు సభ్యులుగా ఉన్న ఈ చారిత్రాత్మక క్లబ్‌పై కక్షపూరిత చర్యలు జరిగాయని ఆరోపిస్తూ, ఇప్పటికే అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదన్నారు.
పట్టించుకోలేదు
ఆర్.కే. మీట్ హోటల్ నిర్వాహకుడు సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. తమ కుమారుడు కృష్ణతేజ నిర్వహిస్తున్న క్యాంటీన్‌ను బలవంతంగా ఖాళీ చేయించాలని కొంతకాలంగా ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే కోర్టును ఆశ్రయించి గడువు కోరినా పట్టించుకోలేదన్నారు. శనివారం తెల్లవారుజామున దుండగులు క్యాంటీన్‌లోకి ప్రవేశించి పూర్తిగా ధ్వంసం చేశారని చెప్పారు. విషయం తెలుసుకుని ప్రశ్నించిన యువరాజ్‌పై దౌర్జన్యానికి దిగారని ఆరోపించారు.


