ప్రైవేటు వాహనాలు, ఆటోలు అదనపు చార్జీలు
ట్రాక్టర్ల అద్దె పెంపు
లబోదిబోమంటున్న రైతులు
బండి బయటకు తీయాలంటే భయపడే కాలం వచ్చింది. పెట్రోల్, డీజిల్ ధరలు ఏకంగా రూ.3 పెరిగి మంట పుట్టిస్తున్నాయి. పెరిగిన పెట్రో ధరలతో వాహనచోదకులకు పెనుభారం తప్పడం లేదు. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లోనే పెట్రో ధరలు అధికంగా ఉన్నాయి. దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలపై ఇంధన భారం పడి ఇక్కట్లు పడాల్సిన పరిస్థితి నెలకొంది.
తిరుపతి అర్బన్: చంద్రబాబు సర్కార్ సామాన్యుల నడ్డి విరుస్తోంది. పన్నుల మినహాయింపు లేకపోవడంతో అన్ని రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్‌లో ఇంధనం ధరలు అధికంగా ఉండడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఎప్పుడు లేని విధంగా ఒక్కసారిగా పెట్రోల్, డీజిల్ లీటర్‌పై రూ.3 పెంచడం చర్చినీయాంశంగా మారింది. సాధారణంగా లీటర్‌పై 25 పైసలు పెంచితేనే ప్రైవేటు వాహనాలు, ఆటోలు పెద్ద మొత్తంలో చార్జీలు పెంచడం తెలిసిందే. అలాంటిది ఏకంగా రూ.3 పెంచడంతో ఇష్టారాజ్యంగా ప్రైవేటు వాహనాలు, ఆటోల యజమానులు రవాణా చార్జీలు పెంచుకుంటున్నారు. మరోవైపు ఇంధనం ధరలు పెరగడంతో కూరగాయలు, పప్పులు, ఇతర సరుకుల ధరలు సైతం పెంచే ప్రమాదం ఉందని పలువురు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 189 పెట్రోల్ బంకులు నడుస్తున్నాయి. రోజుకు 7.4 లక్షల లీటర్ల పెట్రోల్, 5.6 లక్షల లీటర్ల డీజిల్ వినియోగం జరుగుతోంది. ఈ లెక్క ప్రకారం రోజుకు రూ.12 కోట్లు జిల్లా వ్యాప్తంగా ఇంధనం విక్రయాలు సాగుతున్నాయి. లీటర్‌పై రూ.3 పెంచడంతో 12 లక్షల లీటర్లపై రోజుకు రూ.36 లక్షల అదనపు భారం వాహనచోదకులపై పడుతుంది.
లబోదిబోమంటున్న రైతులు
జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్ మొదలు కావడంతో రైతులు తమ పొలాలను దుక్కులు చేస్తున్నారు. అయితే డీజిల్ ధరలు పెరగడంతో నిన్నటి వరకు ట్రాక్టర్ గంట దుక్కి దున్నితే రూ.1200 అద్దె తీసుకునేవారు. అయితే శనివారం నుంచి ఈ అద్దె రూ.1450 చేశారు. దీంతో రైతులకు అదనపు భారం పడుతోంది. డీజిల్ ధరలు పెరగడంతో ఐదు ఎకరాలు ఉన్న రైతుకు ఒక్కో సీజన్‌కు రూ.10 వేలు వరకు అదనంగా పెట్టుబడి పెరుగుతుందని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.
ఇంధనం లీటర్‌పై రూ.3 పెంపు


