దొరవారిసత్రం: తోటి పిల్లలతో ఆడుతున్న మూడేళ్ల బాలుడు నీటి అండాలో (నీళ్ల డ్రమ్ము) ప్రమాదశాత్తు పడి మృతి చెందిన ఘటన గొల్లపాళెం పరిధిలోని ఎస్టీ కాలనీలో శనివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గొల్లపాళెం ఎస్టీ కాలనీకి చెందిన తిరుమలశెట్టి శివ, మారెమ్మ దంపతులకు కుమార్తె హరిత, కుమారుడు శివయ్య ఉన్నారు. సోమవారం ఉదయం బాలుడు శివయ్య అందరి పిల్లలతో అడుతూ ఉన్నాడు. ఎంతసేపటికి బాలుడు ఇంటికి రాకపోవడంతో కంగారు పడిన తల్లిదండ్రులు వీధుల్లో, పలువురి ఇంటి వద్ద వెతికి వాకబు చేశారు. తీర ఇంటి అవరణలో ఉన్న నీరు ఉన్న అండాలో తల భాగం మునిగిపోయి కాళ్లు పైకి ఉండిపోయి విగత జీవిగా కనింపచడంతో ఆ దృశ్యం చూసిన తల్లిదండ్రులు అల్లాడిపోయి కన్నీమున్నీరుగా విలపించసాగారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు.
పర్యావరణ పరిరక్షణ
ప్రతి ఒక్కరి బాధ్యత
ఏర్పేడు: పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ అన్నారు. శనివారం ఉదయం ఏర్పేడు బస్టాండ్ కూడలిలో మండలంలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర– స్వ ర్ణాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని, ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ సంచులు, ఒకసారి వినియోగించి పారేసే ప్లాస్టిక్ వస్తువులు, ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల వినియోగం పర్యావరణానికి తీవ్ర హానికరమని తెలిపారు. కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, ఎంపీడీఓ సౌభాగ్యం, తహసీల్దార్ రాజశేఖర్, డిప్యూటీ ఎంపీడీఓ రమణకుమార్, వెలుగు ఏపీఎం ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.
తిరుపతిలో
గంజాయి బాచ్ హల్‌చల్
తిరుపతి కల్చరల్: నగరంలోని గోవిందరాజస్వామి ఆలయం ఎదుట ముగ్గురు యువకులు గంజాయి మత్తులో కర్రలతో హహల్‌చల్ చేయడంతో దర్శనం కోసం వచ్చిన భక్తులు ఆందోళనకు గురైన సంఘటన శనివారం చోటు చేసుకుంది. గంజాయి మత్తులో భక్తులను ఇబ్బందులకు గురి చేస్తున్న యువకుల ఆగడాలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన టీటీడీ సెక్యూరిటీ సిబ్బందిపై మత్తులో ఉన్న యువకులు ఎదురు తిరగడం కనిపించింది. గోవిందరాజస్వామి ఆలయం ఎదుట గంజాయి బ్యాచ్ ఆగడాలపై స్థానికులు, భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనపై పోలీసులు చర్యలు తీసుకుని అరికట్టాలని విజ్ఞప్తి చేశారు.
పంటలపై ఏనుగుల దాడులు
భాకరాపేట: చిన్నగొట్టిగల్లు మండలంలోని బొగలవారిపల్లిలో శుక్రవారం రాత్రి ఏనుగులు పంటలపై దాడులు చేసి, తీవ్ర నష్టం కలిగించాయి. మామిడి తోటలు, నేపియర్ గడ్డి, నీటి పైపులను ఏనుగులు ధ్వంసం చేశాయని గ్రామానికి చెందిన రైతులు అమరేంద్ర, చంద్రశేఖర్, చెల్లమ్మ, మునిచంద్ర, విశ్వనాథం ఆవేదన వ్యక్తం చేశారు.


