తిరుపతి సిటీ: జిల్లాలో ఈనెల 21వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల హాల్‌టికెట్లను బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ శుక్రవారం రాత్రి విడుదల చేసింది. ఈ మేరకు విద్యార్థులు శనివారం తమ హాల్‌టికెట్లను బీఐఈ వెబ్‌సైట్ ద్వారా లేదా 9552300009 వాట్సప్ నంబర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఫస్ట్ ఇయర్ విద్యార్థులు పాత హాల్‌టికెట్ నంబర్‌ను ఎంటర్ చేసి హాల్‌టికెట్ పొందవచ్చని, సెకండ్ ఇయర్ విద్యార్థులు తమ సెకండ్ ఇయర్ హాల్‌టికెట్ నంబర్లతో హాల్‌టికెట్లు పొందవచ్చని తెలిపారు. విద్యార్థి ఫొటో, సంతకంలో తేడా ఉన్నా సంబంధిత కళాశాల ప్రిన్సిపాళ్లను సంప్రదించి సరిచేసుకోవాలని సూచించారు.
నాణ్యమైన విద్యుత్ సరఫరాకు కృషి
తిరుపతి రూరల్: ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా చేసేందుకు కృషి చేస్తున్నామని ఆ సంస్థ సీఎండీ శివశంకర్ లోతేటి తెలిపారు. ఏపీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో శనివారం టవర్ల నిర్మాణ కాంట్రాక్టర్లతో సీఎండీ శివశంకర్ లోతేటి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్థ పరిధిలోని చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాల్లో విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలు, సాంకేతికంగా అవసరం ఉన్న ప్రాంతాల్లో విద్యుత్ టవర్ల నిర్మాణానికి టెండర్లను ఆహ్వానించి, టెండర్లను ఖరారు చేశామన్నారు. అయితే టవర్ల నిర్మాణంలో నాణ్యతను మరింత పటిష్ట పరిచేందుకు వీలుగా ఆ పనులను చేపట్టే ముందు సంబంధిత కాంట్రాక్టర్లతో సమీక్షను నిర్వహిస్తున్నామని తెలిపారు. టవర్ల నిర్మాణానికి వినియోగించే పరికరాల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, టవర్ డిజైన్, టవర్ల మధ్య నిర్దేశిత దూరం కచ్చితంగా ఉండేలా పనులను చేపట్టాలని కోరారు. ఈ పనుల పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ సమీక్షలో సంస్థ డైరెక్టర్లు పి.అయూబ్‌ఖాన్, కె.గురవయ్య, చీఫ్ జనరల్ మేనేజర్ జె. రమణాదేవి, జనరల్ మేనేజర్లు శ్రీనివాసులు, జగదీష్, కాంట్రాక్టర్లు అభిషేక్, కృష్ణప్రసాద్ పాల్గొన్నారు.


