శృతి మించుతున్న కూటమి | - | Sakshi
Sakshi News home page

శృతి మించుతున్న కూటమి

May 17 2026 12:18 AM | Updated on May 17 2026 12:18 AM

● వైఎస్సార్‌సీపీ మహిళా నేతపై సోషల్‌ మీడియాలో అనుచిత పోస్టులు ● టీడీపీ నేతల తీరును నిరసిస్తూ గాంధీ విగ్రహం వద్ద ధర్నా ● వైఎస్సార్‌ సీపీ ధర్నాకు వ్యతిరేకంగా కూటమి నిరసన పేరుతో రచ్చ

● వైఎస్సార్‌సీపీ మహిళా నేతపై సోషల్‌ మీడియాలో అనుచిత పోస్టులు ● టీడీపీ నేతల తీరును నిరసిస్తూ గాంధీ విగ్రహం వద్ద ధర్నా ● వైఎస్సార్‌ సీపీ ధర్నాకు వ్యతిరేకంగా కూటమి నిరసన పేరుతో రచ్చ

సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతిలో టీడీపీ, జనసేన నేతల తీరు శృతిమించుతోంది. టీడీపీ రౌడీ మూకల తీరుని నిరసిస్తూ శుక్రవారం వైఎస్సార్‌సీపీ మహిళల చేపట్టిన శాంతియుత ధర్నా భగ్నం చేసేందుకు కూటమి శ్రేణులు వ్యవహరించిన తీరుతో నగరంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. తిరుపతిలో ఏమి జరగబోతుందోనని స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. తిరుపతి నగరంలో ఆకు రౌడీల ముందు పెట్టి భూ ఆక్రమణలకు తెగబడుతున్న టీడీపీ, జనసేన తీరుని తప్పుబడుతూ వైఎస్సార్‌సీపీ మహిళా నేత విజయలక్ష్మి సోషల్‌ మీడియా వేదికగా వారిని ప్రశ్నించారు. ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేని టీడీపీ నేత జేబీ శ్రీనివాసులు అనుచరుడు మాచర్ల రఘురాం వైఎస్సార్‌సీపీ మహిళ నాయకురాలు విజయలక్ష్మిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టారు. రఘురాం పెట్టిన పోస్టును తప్పుబడుతూ వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని గాంధీ విగ్రహం వద్ద శాంతియుత ధర్నాకు దిగారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీసీ నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి, వైఎస్సార్‌సీపీ మహిళ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గీతాయాదవ్‌, మహిళ విభాగం నగర అధ్యక్షురాలు కోటేశ్వరమ్మ, ఉపాధ్యక్షురాలు విజయలక్ష్మి, అంగన్‌వాడీ విభాగం నగర అధ్యక్షురాలు పద్మజ, మహిళ నాయకురాళ్లు విజయ రాయల్‌, హేమలత, మునీశ్వరీ, ప్రమీల, మంజుల, కృష్ణవేణి, ఉష. జ్యోతి, లక్ష్మి, మమత, సాయి కుమారి తదితరలతో పాటు పార్టీకి చెందిన వివిధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

వైఎస్సార్‌ సీపీ నేతలను వారిస్తున్న పోలీసులు

శాంతియుత ధర్నాను భగ్నం చేసేందుకు కూటమి కుట్రలు

వైఎస్సార్‌సీపీ మహిళల ధర్నాను భగ్నం చేసేందుకు కూటమి నేతలు పన్నిన కుట్రను అమలు చేసేందుకు టీడీపీ మహిళలు అద్దె జనంతో రంగంలోకి దిగారు. అద్దె మహిళలతో టీడీపీ, జనసేన మహిళా నాయకులు గాంధీ విగ్రహం వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈస్ట్‌ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు ఇవ్వాలని చెప్పి డాక్టర్‌ అంబేడ్కర్‌ విగ్రహం నుంచి ర్యాలీగా బయలు దేరారు. ఆ పక్కనే గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేస్తున్న వైఎస్సార్‌సీపీ మహిళలను చూస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు దిగారు. వేళ్లు చూపిస్తూ హెచ్చరిస్తూ కేకలు వేశారు. వైఎస్సార్‌సీపీ మహిళలపై దాడికి యత్నించారు. శాంతియుతంగా ధర్నా చేస్తుంటే.. తమపై దాడికి యత్నిస్తారా? అంటూ వారిని అడ్డుకునేందుకు వైఎస్సార్‌సీపీ మహిళలు యత్నించారు. పరిస్థితిని గమనించిన పోలీసులు వైఎస్సార్‌సీపీ మహిళలను అడ్డుకునేందుకు యత్నించారే తప్ప.. కూటమి మహిళలను నిలువరించలేదు. పోలీసుల తీరుపై వైఎస్సార్‌సీపీ శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

నగరం నడిబొడ్డులో ఉద్రిక్తత

ఆధ్యాత్మిక నగరంలో కూటమి నేతల కవ్వింపు చర్యలతో ఈస్ట్‌ పోలీస్టేషన్‌ ఎదుటే ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. డాక్టర్‌ అంబేడ్కర్‌ విగ్రహం నుంచి గాంధీ విగ్రహం వద్దకు చేరుకున్న టీడీపీ, జనసేన మహిళలు అద్దె జనంతో వైఎస్సార్‌సీపీ మహిళా నేతలపై దూసుకెళ్లేందుకు యత్నించారు. దీంతో కొంత సమయం తిరుపతి నగర వాసులు భయభ్రాంతులకు గురయ్యారు. కూటమి నేతలపై వైఎస్సార్‌సీపీ ఈస్ట్‌ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శాంతియుతం ధర్నా చేసిన వైఎస్సార్‌సీపీ మహిళలు, నాయకులపై టీడీపీ, జనసేన మహిళలు కూడా ఈస్ట్‌ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేయడం గమనార్హం.

Advertisement
 
Advertisement
Advertisement