ఐసెట్‌లో తిరుపతి విద్యార్థికి 4వ ర్యాంకు | - | Sakshi
Sakshi News home page

ఐసెట్‌లో తిరుపతి విద్యార్థికి 4వ ర్యాంకు

May 17 2026 12:18 AM | Updated on May 17 2026 12:18 AM

● ఎస్వీయూ పరిధిలో 87.65 శాతం ఉత్తీర్ణత ● ఎస్వీయూ పరిధిలో టాప్‌టెన్‌లో ముగ్గురికి చోటు

తిరుపతి సిటీ:రాష్ట్రంలోని యూనివర్సిటీల పరిధిలోని కళాశాలల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆంధ్ర యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈనెల 2వ తేదీన జరిగిన ఏపీ ఐసెట్‌–2026 ఫలితాలను ఉన్నత విద్యామండలి శనివారం విడుదల చేసింది. ఎస్వీయూ పరిధిలో 9,405 మంది విద్యార్థులు ఐసెట్‌కు దరఖాస్తు చేసుకోగా 8,537మంది పరీక్షకు హాజరయ్యారు. ఇందులో 7,483 మంది ఉత్తీర్ణత సాధించడంతో 87.65 శాతం నమోదైంది. ఎస్వీయూ పరిధిలో ముగ్గురు విద్యార్థులు ప్రతిభ కనబరచి టాప్‌ టెన్‌లో చోటు దక్కించుకున్నారు. నెల్లూరుకు చెందిన విద్యార్థి షేక్‌ ఖజాలియాఖాత్‌ 161.74 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంక్‌ సాధించగా, 160.80 మార్కులతో తిరుపతికి చెందిన రామచంద్రారెడ్డి 4వ ర్యాంకు సాధించారు. అలాగే 155.20 మార్కులతో అన్నమయ్య జిల్లాకు చెందిన మల్లికార్జున 10వ ర్యాంకు సాధించారు. వీరితో పాటు వినోద్‌ వెంకటసాయి 14వ ర్యాంకు, మనోనిత్య 15, రంజిత్‌ 18, టి మాధురి 20, చంద్రగిరి లలిత 24, ఆశిష్‌ కుమార్‌ 31, కిరణ్‌ కుమార్‌ 34 ర్యాంకులను సాధించి రాష్ట్ర స్థాయిలో సత్తా చాటారు.

తిరుపతి జిల్లాలో 91.56 శాతం ఉత్తీర్ణత

జిల్లా వ్యాప్తంగా 4 పరీక్ష కేంద్రాలలో జరిగిన ఏపీ ఐసెట్‌–2026కు 1,598 మంది దరఖాస్తు చేసుకోగా 1,435 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇందులో 91.56 శాతంతో 1,314మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ ఏడాది సైతం ఐసెట్‌ ఫలితాలలో మహిళా అభ్యర్థులే పైచేయి సాధించారు. జిల్లాలో 770 మంది మహిళా అభ్యర్థులు పరీక్షకు హాజరుకాగా ఇందులో 92.33 శాతంతో 711 మంది ఉత్తీర్ణత సాధించారు.

Advertisement
 
Advertisement
Advertisement