ప్రైవేటును ఆశ్రయిస్తున్న గ్రామీణ తల్లిదండ్రులు
ఇంటర్ కోసం వలస వెళుతున్న విద్యార్థులు
సర్కార్ కాలేజీల్లో దిగజారుతున్న విద్యార్థుల సంఖ్య
●
గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్ కోసం పట్టణాలకు వలసబాట పడుతున్నారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో రూ.లక్షల్లో ఫీజులు గుంజుతున్నా లెక్క చేయక చేర్చుతున్నారు. ఏటా ప్రభుత్వ కళాశాల్లో అడ్మిషన్ల సంఖ్య పడిపోతున్నా ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. దీంతో సర్కారు జూనియర్ కాలేజీల మనుగడ ప్రశ్నార్థకం కానుంది.
తిరుపతి సిటీ: రెండేళ్ల నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్ల పరిస్థితి దారుణంగా దిగజారిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఒకప్పుడు ప్రభుత్వ కాలేజీల్లో ఇంటర్మీడియట్ కోర్సుల్లో సీట్ల కోసం విద్యార్థులు పోటీపడేవారు, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి స్థాయిలో సిఫార్సు లేఖలు, ఫోన్‌కాల్స్ తో సీట్ల కోసం విద్యార్థులు కళాశాల వెంటపడేవా రు. అలాంటి పరిస్థితి నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాలల అంటేనే అటు వైపు కన్నెత్తి చూడని స్థితికి చేరింది. ఇందుకు ప్రధాన కారణం ప్రభుత్వ కళాశాలల్లో అధ్యాపకుల కొరత, పర్యవేక్షణ లోపం, ఇంటర్ ఫలితాల సరళి, జేఈఈ, నీట్ వంటి పోటీ పరీక్షలకు ఆశించిన స్థాయిలో విద్య అందకపోవడమే నని విద్యావేత్తలు చెబుతున్నారు. దీనికితోడు ప్రభు త్వ కాలేజీల్లో మౌలిక సదుపాయాలపై పది పాసైన విద్యార్థులకు అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారనే వాదన వినిపిస్తోంది
ప్రైవేటు వైపు పరుగులు
గ్రామీణ ప్రాంత విద్యార్థుల తల్లిదండ్రులు తమ పి ల్లలను పట్టణంలోని పేరొందిన ప్రైవేటు కాలేజీలో చేర్పించాలనే తపనతో రూ.లక్షల ఫీజు ఉన్నా.. లె క్క చేయకుండా పట్టణ ప్రాంతాలవైపు చూస్తున్నా రు. అందులోనూ ప్రైవేటు యాజమాన్యాలు గ్రా మీణ ప్రాంతాల్లో పదో తరగతి పాసైన ప్రతి విద్యార్థి తల్లిదండ్రులను నేరుగా కలిసి తమ కళాశాలల్లో నీట్, జేఈఈ వంటి పోటీ పరీక్షలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామంటూ మభ్యపెట్టే ప్రయత్నా లు చేస్తున్నాయి. ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయకపోవడంతో గ్రామీణ ప్రాంత విద్యార్థులు విజయవాడ, తిరుపతి, నెల్లూరు, వైజాగ్ వంటి ప్రాంతాల్లో పేరొందిన కళాశాలలకు వలస వెళుతున్నారు. గత ఏడాది జిల్లాలో పదో తరగతి 21,298 మంది ఉత్తీర్ణులు కాగా ఇందులో సుమారు 14 వేల మంది విద్యార్థులు పట్టణాల్లో ఇంటర్ చేరేందుకు వలస వెళ్లినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది జిల్లాలో 22,235 మంది ఉత్తీర్ణులు కాగా సర్కారు కాలేజీల్లో ఎంతమంది చేరుతారు చూడాల్సి ఉంది.
రెండేళ్లుగా పరిస్థితి ఇదీ...
జిల్లాలో 21 ప్రభుత్వ జూనియర్ కళాశాలలుండగా గత ఏడాది ప్రవేశాలు కేవలం 1500 దాటకపోవడం ఆశ్చర్యకరం. అలాగే ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తు న్న ఒక ఎయిడెడ్, ఒక ఏపీఆర్‌జేసీ, పది ఏపీఎస్‌డబ్ల్యూఆర్, 3 ఏపీటీడబ్ల్యూఆర్, రెండు బీసీ రెసిడెన్షియల్, 23 హైస్కూల్ ప్లస్, నాలుగు కేజీబీవీ, ఐదు ఏపీఎంఎస్ కళాశాలల్లో 60 శాతం సీట్లు భర్తీ కాకపోవడం విశేషం. కేవలం టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీ ఆర్ట్స్ కాలేజీ, ఎస్పీడబ్ల్యూ కళాశాలలో మాత్రమే కాస్త మెరుగ్గా సీట్లు భర్తీ అవుతున్నాయి.
పట్నం వైపు పరుగులు
ఈ ఏడాది మెరుగైన ప్రవేశాలే లక్ష్యం
జూనియర్ కళాశాలల్లో ఈ ఏడాది మెరుగైన ప్రవేశాలే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాం. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మౌలిక వసతులకు కొదవలేదు. మధ్యాహ్న భోజన వసతి, ఉచితంగా పుస్తకాలు, తల్లికి వందనం, స్టడీమెటీరియల్, జేఈఈ, నీట్ పోటీ పరీక్షలకు సైతం ప్రత్యేక మెటీరియల్స్ విద్యార్థులకు అందజేస్తాం. గ్రామీణ ప్రాంత విద్యార్థులు పట్టణాలపై మోజు పెంచుకోకకుండా తమకు సమీపంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ అడ్మిషన్లు పొందాలి. –జి రాజశేఖర్‌రెడ్డి, ఆర్‌ఐఓ, తిరుపతి


