ఇదే ఆఖరి నోటీసు | - | Sakshi
Sakshi News home page

ఇదే ఆఖరి నోటీసు

May 16 2026 5:05 AM | Updated on May 16 2026 5:05 AM

తిరుపతి అర్బన్‌: ఇదే ఆఖరి నోటీసు.. పాఠశాలకు ఉపాధ్యాయులు హజరుకాకుంటే ప్రభుత్వ నిబంధనల మేరకు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని డీఈఓ కేవీఎన్‌ కుమార్‌ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కొందరు ఉపాధ్యాయులు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా దీర్ఘకాలంగా పాఠశాలకు రావడం లేదని తెలిపారు. ప్రధానంగా ఓజిలి మండలంలోని ఓజిలి జెడ్పీ హైస్కూలులో పనిచేస్తున్న స్కూల్‌ అసిస్టెంట్‌ ఎం.సుమనకుమారికి 2024 డిసెంబర్‌ 1 నుంచి పలుసార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ ఆమె ఇప్పటి వరకు విధులకు హాజరుకావడం లేదని పేర్కొన్నారు. అలాగే దొరవారిసత్రం మండలంలోని కల్లూరు జెడ్పీ హైస్కూలులో గణితం(స్కూల్‌ అసిస్టెంట్‌)ఏ. విశ్వనాథానికి 2024 మార్చి 29 నుంచి పలుసార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ ఆయన ఇప్పటి వరకు విధులకు హాజరుకాలేదని స్పష్టం చేశారు. ఇకపై పాఠశాల విధులకు హాజరుకావాలని కోరుతున్నామని, లేకుంటే ప్రభుత్వ నిబంధనల మేరకు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

జూన్‌ 5 నుంచి ‘సర్‌’

తిరుపతి అర్బన్‌: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జూన్‌ 5 నుంచి ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ ఎస్‌. వెంకటేశ్వర్‌ వెల్లడించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ జూన్‌ 5 నుంచి 14వ తేదీ వరకు ఎస్‌ఐఆర్‌పై ఓటర్ల జాబితాకు సంబంధించి సన్నాహాలు, శిక్షణతోపాటు ముద్రణ ఉంటుందని చెప్పారు. అలాగే జూన్‌ 15 నుంచి జూలై 14వ తేదీ వరకు బూత్‌లెవల్‌ ఆఫీసర్లు(బీఎల్వో) ఇంటింటా పర్యటిస్తారని చెప్పారు. మరోవైపు జూలై 14వ తేదీన పోలింగ్‌ కేంద్రాల హేతుబద్దీకరణ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. జూలై 21వ తేదీన ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ చేస్తామని పేర్కొన్నారు. అలాగే జూలై 21 నుంచి ఆగస్టు 20 తేదీ వరకు దావాలు, అభ్యంతరాల కాలం జరుగుతుందన్నారు. మరోవైపు జూలై 21 నుంచి సె ప్టెంబర్‌ 18వ తేదీ వరకు నోటీసు దశ, పరిష్కారానికి సంబంధించిన దావాలు, అభ్యంతరాలు ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. చివరిగా సెప్టెంబర్‌ 22న ఓటర్ల తుది జాబితా ప్రచురిస్తామన్నారు.

టీటీడీకి రూ.10 లక్షల విరాళం

తిరుమల: ఎస్పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లా కావలికి చెందిన తిరుమలశెట్టి భవిష్‌ కృష్ణ అనే భక్తుడు శుక్రవారం టీటీడీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి రూ.10,00,116 విరాళం ఇచ్చారు. ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ అదనపు ఈఓ క్యాంపు కార్యాలయంలో అదనపు ఈఓ సీహెచ్‌.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు.

వచ్చే నెల 5న

ఎస్వీయూ స్నాతకోత్సవం

తిరుపతి సిటీ: ఎస్వీయూ 63 నుంచి 68వ స్నాతకోత్సవాలను వచ్చేనెల 5వ తేదీన నిర్వహించనున్నారు. కాగా ఇప్పటి వరకు కాన్వొకేషన్‌కు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు ఈనెల 18వ తేదీలోపు ఇన్‌అడ్వాన్స్‌డ్‌ డిగ్రీకి దరఖాస్తు చేసుకోవాలని కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ డాక్టర్‌ రాజామాణిక్యం ఒక ప్రకటనలో తెలిపారు. గడువు పూర్తి అయిన తర్వాత వచ్చిన దరఖాస్తులు స్వీకరించకూడదని పరీక్ష విభాగాధికారులకు ఆయన సూచించారు.

సాధారణ రోజుల్లోనూ

తిరుచానూరులో భక్తుల రద్దీ

తిరుపతి అర్బన్‌: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల సమయంలోనే కాకుండా సాధారణ రోజుల్లోనూ భక్తుల రద్దీ ఎక్కువగా ఉందని కలెక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, ఎస్పీ సుబ్బరాయుడు, సీవీఎస్‌ఓ మురళీకృష్ణతో కలసి మాస్టర్‌ ప్లాన్‌ రోడ్డు నిర్మాణంపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం రోడ్డు విస్తరణతోపాటు వాహనాల పార్కింగ్‌కు ఇబ్బందులు లేకుండా చేపట్టాల్సిన అంశాలపై చర్చించామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ ఇన్‌చార్జి కమిషనర్‌ శారదా దేవి, డిప్యూటీ కమిషనర్‌ అమరయ్య, అడిషనల్‌ ఎస్పీ రవి మనోహరచారి, తిరుపతి ఆర్టీఓ రామ్మోహన్‌, ఏడీ సర్వేయర్‌ అరుణ్‌ కుమార్‌, సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ శ్యాంసుందర్‌, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ సుధాకర్‌ నాయక్‌, తుడా ఎస్‌ఈ రవీంద్ర, తుడా సీపీఓ దేవి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement