తిరుపతి సిటీ: నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు అన్న చందంగా తయారైంది రాష్ట్రంలో ప్రభుత్వ వైఖరి. 2023లో వర్సిటీల్లో అధ్యాపక పోస్టులకు అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. నిరుద్యోగ అభ్యర్థులు దరఖాస్తులు సైతం చేసుకున్నారు. నియామక ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో ఎన్నికలు రావడం, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టింది. దీంతో గత ప్రభుత్వం ఇచ్చిన అధ్యాపక పోస్టుల నోటిఫికేషన్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని ఆ నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రభుత్వ ప్రకటించింది. కానీ మళ్లీ అదే నోటిఫికేషన్‌ను మసిబూసి మారేడు కాయచేసి బాబు సర్కార్ శుక్రవారం విడుదల చేయడంపై ఇదేమి విడ్డూరమని నిరుద్యోగ అభ్యర్థులు, విద్యావేత్తలు అంటున్నారు.
క్రెడిట్ చోరీలో వారికి వారే సాటి
గత ప్రభుత్వం చేసిన మంచిని చెడుగా చూపించడం, అదే మంచిని తాము చేస్తున్నామంటూ క్రెడిట్ చోరీ చేసి మళ్లీ ప్రజల ముందుంచడం బాబు అండ్ కోకు వెన్నతో పెట్టిన విద్య. ఎస్వీయూ, ద్రవిడ, పద్మావతి మహిళా యూనివర్సిటీల్లో అధ్యాపక పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయడమే ఇందుకు నిదర్శనమని వర్సిటీల్లో పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. గత ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్లనే మళ్లీ విడుదల చేశారు తప్ప ఇందులో కొత్తదనం కానీ, పోస్టులు పెరగడం కానీ ఏమీ లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా రోస్టర్ విధానం గందరగోళంగా ఉందని, నోటిఫికేషన్ విడుదల కాకముందే రోస్టర్ విధానాన్ని అమలు చేయడంపై మేధావులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
నూతన నోటిఫికేషన్ వివరాలు
ఉన్నత విద్యామండలి ఎస్వీయూ, పద్మావతి మహిళా వర్సిటీల్లో పలు అధ్యాపకపోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా ఎస్వీయూలో రెగ్యులర్, బ్యాక్ లాగ్ కలిపి 125 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో రిజర్వేషన్ల కేటగిరీలతో కలిపి 86 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులున్నాయి. అలాగే పద్మావతి మహిళా వర్సిటీలో రెగ్యులర్, బ్యాక్ లాగ్ కలిపి 48 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హతగల అభ్యర్థులు ఈనెల 18వ తేదీ నుంచి వచ్చేనెల 8వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని వర్సిటీ అధికారులు తెలిపారు. అర్హత, దరఖాస్తు వివరాలకు ఆయా వర్సిటీల అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.


