తిరుపతి క్రైం : నగరంలోని గరుడ వారధి పైనుంచి దూకి ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. కరకంబాడి వైపు నుంచి లీలామహల్ సర్కిల్ దిశగా వస్తున్న ఫ్లై ఓవర్‌పై శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. నంద్యాల జిల్లాలోని జూపాడు బంగ్లా మండలం పాయమంచాలకు చెందిన ఆదిలక్ష్మి (24) కుటుంబ సభ్యులతో కలిసి జీవనోపాధి కోసం తిరుపతికి వలస వచ్చింది. ఆమె, తన అన్నతో కలిసి ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నట్లు సమాచారం. అయితే శుక్రవారం ఉదయం అనూహ్యంగా గరుడ వారధిపై నుంచి కిందకు దూకేసింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. కేసు నమోదుచేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వివరించారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
రాపూరు: పెంచలకోన –ఏర్పేడు రహదారిలోని రాపూరు మండలం సిద్ధవరం బ్రిడ్జి వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు.. శ్రీకాళహిస్తి మండలం వీ.ఎం. పల్లి గ్రామానికి చెందిన ఐదుగురు ఆటోలో పెంచలకోనకు బయలుదేరారు. రాపూరు నుంచి వెంకటగిరి వైపు వెళుతున్న బోలెరో వాహనం సిద్ధవరం బ్రిడ్జి వద్ద ఆటోను ఢీ కొంది. ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. సమాచా రం అందుకున్న 108 సిబ్బంది గాయపడిన వారిని రాపూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో పసల పద్మమ్మ (50)మృతి చెందారు. గురవమ్మ, లక్ష్మినసింహ, శ్రావణి, చంద్రకి చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇరువర్గాల ఘర్షణ.. కేసు నమోదు
వరదయ్యపాళెం: మండలంలోని బత్తలవల్లంలో భూ వివాదమై ఇరువర్గాలు ఘర్షణ పడ్డా యి. ఈ విషయమై రెండు వర్గాలపై కేసులు నమోదు చేసినట్లు ఎస్‌ఐ మల్లికార్జున్ తెలిపారు. మండలంలోని బత్తలవల్లంలో తమ అధీనంలోని భూమిలో అక్రమంగా ప్రవేశించిన చెల్లయ్యను ప్రశ్నించినందుకు చెల్లయ్యతో పాటు అతనికి మద్దతుగా బంధువులైన వంశీ, వనమ్మ, రాజేశ్వరి, నిర్మల అనే వ్యక్తులు తనతో పాటు తనకు అండగా అడ్డు వచ్చిన మునెమ్మను కరల్రతో దాడి చేసి గాయపరిచారని రాజేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. అలాగే తమ భూమిలో భూ అభివృద్ధి పనులు చేసుకుంటుండగా, అదే గ్రామానికి చెందిన రమణయ్య, దినేష్, భాస్కర్, అభిషేక్ మూకుమ్మడిగా తనపై దాడి చేయగా తనకు మద్దతుగా అడ్డు వచ్చిన చాన్వి, వనమ్మపై కర్రలతో దాడి చేశారని చెల్లయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
రైలు కింద పడి వ్యక్తి బలవన్మరణం
రైల్వేకోడూరు అర్బన్: పట్టణంలోని రైల్వేస్టేషన్‌లో శుక్రవారం గుర్తుతెలియని వ్యక్తి ఇంటర్‌సిటీ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు జీన్స్‌ప్యాంటు, తెల్లచొక్కా ధరించి ఉన్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృత దేహాన్ని పోస్టుమార్టానికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
ఉచిత ఫుట్‌బాల్ శిక్షణ ప్రారంభం
రేణిగుంట: మండలంలోని గాజులమండ్యం పంచాయతీ, పీ,ఎం,హైస్కూల్ మైదానంలో జే, ఎఫ్,ఏ ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత ఫుట్‌బాల్ కోచింగ్ ను శుక్రవారం ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా పాస్టర్ డాక్టర్ కేపీ లూథర్ బాబు, ఎస్‌ఐ హరీష, చైర్మన్ కె.పి జయకర్, యేసురత్నం పాల్గొన్నారు. అతిధుల చేతుల మీదుగా అమ్మగుంట ఫౌండేషన్ వారు 150 జెర్సీలను పిల్లలకు ఉచితంగా పంపిణీ చేశారు. ఉదయం 5.30 నుంచి 7. 30 వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 6.30 వరకు కోచింగ్ ఇస్తారని తెలిపారు. కోచింగ్‌లో పాల్గొన్న పిల్లలకు ప్రతి రోజు పాలు , గుడ్డు, అరటిపండు అందిస్తామన్నారు. కార్యక్రమంలో రెవరెండ్ సతీష్, రెవరెండ్ దీపక్, రెవరెండ్ నోవా, డాక్టర్ సుధాకర్, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ ప్రభాకర్, హెడ్ కానిస్టేబుల్ ఉమా, తిరుపతి కోచ్ రమేష్, ఎక్స్‌ఆర్మీ రాజకుమార్, రమేష్, సీనియర్ కోచ్ దీన దయాకర్, సీనియర్ ఫుట్బాల్ ప్లేయర్ శేఖర్ పరమానందం, కెపి దివాకర్, శ్రీరాజ్, శ్రీపతి పాల్గొన్నారు.
వరదయ్యపాళెం: శ్రీసిటీ ఎండీ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి గురువారం రాత్రి సత్యవేడు గంగమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు.ఆయనకు ఆలయ ధర్మకర్త గోపీనాథ్ రెడ్డి ఘన స్వాగతం పలికారు.


