ఉపాధికి.. సరికొత్త పాలిటెక్నిక్‌ | - | Sakshi
Sakshi News home page

ఉపాధికి.. సరికొత్త పాలిటెక్నిక్‌

May 16 2026 5:05 AM | Updated on May 16 2026 5:05 AM

నయా సిలబస్‌

రూపురేఖలు మారుతున్న పాలిటెక్నిక్‌ డిప్లొమో

ఇక అన్ని కోర్సులకు 3 ఏళ్లు మాత్రమే

ప్రతి కోర్సులోనూ ఏఐ సబ్జెక్ట్‌

ఈ ఏడాది నుంచి అమలు

పాలిటెక్నిక్‌..ఇది పేదలకు ఇంజినీరింగ్‌ వంటిది. పేద, మధ్యతరగతి విద్యార్థులు ఆసక్తి చూపే విద్య.. 19 ఏళ్లకే ఉపాధి చూపే కోర్సు.. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ కోర్సు ఈ ఏడాది నుంచి కొత్తరూపు సంతరించుకోనుంది. సిలబస్‌ మారనుండంతో విద్యార్థులకు మరిన్ని ప్రయోజనాలు చేకూరనున్నాయి.

తిరుపతి సిటీ: పాలిటెక్నిక్‌ డిప్లొమో కోర్సులు ఈ ఏడాది నుంచి రూపురేఖలు మారుతున్నాయి. సాంకేతిక విద్యామండలి నూతన సిలబస్‌తో టెక్నికల్‌ విద్యలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టేందుకు పాలిటెక్నిక్‌ డిప్లొమో ఫస్ట్‌ ఇయర్‌ అడ్మిషన్లు చేపట్టనున్నారు. 2026–27 విద్యా సంవత్సరం నుంచి నూతన సిలబస్‌ ‘సీ–26 కరిక్యూలమ్‌’ అమలు చేయనున్నారు. ఇందుకోసం ఇప్పటికే పారిశ్రామిక వేత్తలు, ఐఐటీ నిపుణులు, సబ్జెక్ట్‌ ఎక్స్‌పర్ట్‌తో పలుసార్లు వర్క్‌షాపులు నిర్వహించి కసరత్తు పూర్తి చేశారు. జిల్లాలోని ఆరు ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ఈ ఏడాది నుంచి సరికొత్త పాలిటెక్నిక్‌ విద్యను విద్యార్థులు అభ్యసించనున్నారు.

ప్రతి కోర్సులోనూ ఏఐ తప్పనిసరి

నూతన సీ–26 కరిక్యులమ్‌లో భాగంగా ఈ ఏడాది నుంచి పాలిటెక్నిక్‌ డిప్లొమోలోని అన్ని బ్రాంచీల్లో ఆర్టీఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సబ్జెక్టును తప్పనిసరి చేస్తూ సిలబస్‌ను రూపొందించారు. ఆధునిక ప్రపంచాన్ని శాసిస్తున్న ఏఐ టెక్నాలజీని ప్రతి విద్యార్థీ డిప్లొమో స్థాయిలోనే పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉండాలనే ఉద్ధేశంతో అన్ని కోర్సుల్లోనూ ప్రవేశ పెట్టనున్నారు. అలాగే కంప్యూటర్‌ డిప్లొమో బ్రాంచ్‌లకు ప్రత్యేకంగా ఏఐతో పాటు క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ సబ్జెక్టును ప్రవేశపెట్టనున్నారు. పారిశ్రామిక అవసరాలతోపాటు అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి ఉద్యోగావకాశాలు అందిపుచ్చుకునేలా పాలిటెక్నిక్‌ కోర్సుల రూపురేఖలను మార్చినట్లు అధికారులు వెల్లడించారు.

అన్ని కోర్సులకు 3 ఏళ్ల కాలవ్యవధి

పాలిటెక్నిక్‌ డిప్లొమో కోర్సుల కాలవ్యవధి సాధారణంగా మూడు ఏళ్ల వరకు ఉంది. కానీ స్పెషల్‌ డిప్లొమో ఇన్‌ బయోమెడికల్‌ ఇంజినీరింగ్‌ వంటి పలు కోర్సులకు మాత్రమే మూడు సంవత్సరాల ఆరు నెలల కాలవ్యవధి ఉండేది. కానీ ప్రస్తుత నూతన సిలబస్‌ ప్రకారం అన్ని పాలిటెక్నిక్‌ డిప్లొమో కోర్సులకు ఈ ఏడాది నుంచి మూడు ఏళ్ల కాలవ్యవధి మాత్రమే ఉండనుంది. అలాగే సబ్జెక్ట్‌ ఎంపికలోనూ మార్పులు చేయనున్నారు. మూడో సెమిస్టర్‌ నుంచి ఐదో సెమిస్టర్‌ వరకు ఎంచుకున్న పాఠ్యాంశాలు ఉండగా దీంతో పాటు ఓపెన్‌ ఎలక్టివ్‌ సెబ్జెక్ట్‌ను ఏ బ్రాంచి వారైనా ఎంచుకునేందుకు వీలుకల్పించనున్నారు. ఆరో సెమిస్టర్‌లో పూర్తిస్థాయిలో యథావిధిగా ఇండస్ట్రీయల్‌ ట్రైనింగ్‌, ప్రాజెక్టు వర్క్‌ ఉండనుంది. దీంతో పాటు సెమిస్టర్‌, మిడ్‌ పరీక్షల నిర్వహణలోనూ పలు మార్పులకు శ్రీకారం చుట్టనున్నారు. మిడ్‌ పరీక్షలకు గతంలో 20 శాతం వెయిటేజి మార్కులు ఉండగా ఈ ఏడాది నుంచి ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్థులకు మిడ్‌ పరీక్షలకు 30 శాతం కేటాయించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement