వెంకటగిరిలో పేట్రేగిపోతున్న భూ మాఫియా | - | Sakshi
Sakshi News home page

వెంకటగిరిలో పేట్రేగిపోతున్న భూ మాఫియా

May 16 2026 5:05 AM | Updated on May 16 2026 5:05 AM

● నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి

వెంకటగిరి(సైదాపురం): పట్టణంలో రోజు రోజుకు భూ మాఫియా పెట్రేగిపోతుందని వైఎస్సార్‌ సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. పట్టణంలోని నేదురుమల్లి నివాసంలోని ఎన్‌జేఆర్‌ భవనంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి నేతల ప్రమేయం లేకుండా వెంకటగిరిలో భూ ఆక్రమణలు జరుగుతున్నాయా? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయన్నారు. ఈ విషయమై అధికార పార్టీకి కొమ్ము కాసే పత్రికల్లోలోనే వెంకటగిరిలో భూ మాఫియాపై కథనాలు ప్రచురితమవుతున్నా పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తుందన్నారు. పట్టణంలో అసైన్డ్‌ భూముల్లో కూడా నిబంధనలకు విరుద్ధంగా భవనాలు నిర్మిస్తున్నా పట్టించుకునే నాథుడే లేరని ఆవేదన వ్యక్తం చేశారు. బఫర్‌జోన్‌ కూడా వదలకుండా లేఅవుట్‌లు వేసి రూ. కోట్లు దండుకుంటున్నా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోవడం ఏమిటని ప్రశ్నించారు. రికార్డుల మారుస్తూ భూ కబ్జాల్లో అధికారుల పాత్రపై ప్రముఖ దినపత్రికల్లో వరస కథనాలతో అనుమానాలు రేకెత్తిస్తున్నాయని విమర్శించారు.అధికారులు అక్రమాలకు సహకరిస్తే భవిష్యత్తులో అవస్థలు తప్పవని హెచ్చరించారు. వెంకటగిరిలో ఆక్రమణలపై ఢిల్లీలో ఉన్న గ్రీన్‌ ట్రిబునల్‌కి కూడా ఫిర్యాదు చేశామన్నారు. కాగ వెంకటగిరి పట్టణంలో ప్రభుత్వ భూములు, అసైన్డ్‌ భూములు రికార్డులు మార్చి లే అవుట్లు వేసినా వారిపై చర్యలు తీసుకునేలా పోరాటం సాగిస్తామన్నారు. త్వరలోనే వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఆక్రమణలపై భూ పోరాటం సాగిస్తామని హెచ్చరించారు. అక్రమాలు, ఆక్రమణలు, భూ దందాలు , భూ మాఫియా జరుగుతుడడంతో అధికారపార్టీ అనుకూల పత్రికల్లో కథనాలు రాయడం విస్మయానికి గురిచేస్తుందన్నారు. ఈ వ్యవహారశైలి అంతా ప్రజలు గమనిస్తున్నారని త్వరలోనే తగిన మూల్యం చెల్లించక తప్పదని మరోసారి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకురాలు కోడూరు కల్పలత, మున్సిపల్‌ వింగ్‌ రాష్ట్ర కార్యదర్శి చిట్టేటి హరికృష్ణ, మండల అధ్యక్షుడు పులి ప్రసాద్‌రెడ్డి, కాల్తిరెడ్డి శ్రీనివాసులరెడ్డి, వెందోటి కార్తీక్‌రెడ్డి, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement