పెళ్లకూరు: ఆ రెవెన్యూ కార్యాలయంలో ఫైలు కదలాలంటే ముడుపులు ముట్టజెప్పుకోవాల్సిందేనని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ రికార్డులను అధికారులు, సిబ్బంది కలిసి తారుమారు చేయడం, వన్‌బీ, అడంగల్ మార్చేడం..వాటిని సరిదిద్దే క్రమంలో దిద్దుబాటు ప్రయత్నం చేస్తున్నట్టు నటిస్తూ ఒక్కో స్థాయికి ఒక్కో రేటు చెప్పి బాధితులను నానా ఇబ్బంది పెట్టడం ఇక్కడి రెవెన్యూ అధికారులకు పరిపాటిగా మారింది. పెళ్లకూరు మండలంలోని పుల్లూరు గ్రామానికి చెందిన జంగాలపల్లి గురవారెడ్డి అనే రైతుకు సర్వే నంబర్ 81–1బీ1లో 20సెంట్లు, 81–1బీలో 34సెంట్లు మొత్తం 54సెంట్లు పట్టాభూమి ఉంది. అందులో 20సెంట్లు భూమిని తన కుమారుడు పేరుతో 2021లో రిజిస్ట్రేషన్ చేసుకుని పట్టాదారు పాసుపుస్తకాలు పొంది ఉన్నాడు. అయితే కుమారుడు తన అవసరాలు నిమిత్తం తనకు సంబంధించిన 20 సెంట్లు భూమిని విక్రయించుకోవడానికి ప్రయత్నించగా సంబంధిత భూమి పంటకాలువగా నమోదు అయ్యిందని, రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కుదరదని అధికారులు ద్వారా తెలుసుకున్న బాధితుడు జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించాడు. కలెక్టర్ ఆదేశాలతో భూమికి సంబంధించి మ్యుటేషన్‌కు స్థానిక సచివాలయంలో చలానా కట్టిన బాధితుడు గత ఆరు నెలలుగా రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. వీఆర్వో, సర్వేయర్ తదితర అధికారులు ఫైల్ ముందుకు కదిలేందుకు ఒక్కో స్థాయికి ఒక్కో రేటు డిమాండ్ చేస్తూ బాధితుడిని కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారు. చివరికి బాధితుడు తన పని పూర్తి చేస్తారనే ఆశతో కొంత నగదు రూపంలోనూ, మరి కొంత ఫోన్‌పే ద్వారా చెల్లించినప్పటికీ కొందరు అధికారులు పని చేయకుండా కాలయాపన చేస్తున్నట్లు బాధిత రైతు వాపోయాడు. ఈ విషయమై స్థానిక తహసీల్దార్ హరికృష్ణను సాక్షి వివరణ కోరగా భూసమస్యకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు అందలేదని, పూర్తి స్థాయిలో పరిశీలించి బాధిత రైతుకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు.


