ముగిసిన గంగ జాతర | - | Sakshi
Sakshi News home page

ముగిసిన గంగ జాతర

May 15 2026 12:49 PM | Updated on May 15 2026 12:49 PM

● ఆలయంలో కిక్కిరిసిన జనం ● బంకమట్టికి ఎగబడిన భక్తులు

● ఆలయంలో కిక్కిరిసిన జనం ● బంకమట్టికి ఎగబడిన భక్తులు

తిరుపతి కల్చరల్‌: తిరుపతి గంగమ్మ జాతరలో భాగంగా మంగళవారం రాత్రి అమ్మవారి విశ్వరూప దర్శనంతో భక్తులు పులకించిపోయారు. తాతయ్యగుంట గంగమ్మ జాతర వైభవంగా సాగింది. ఏడు రోజుల గంగమ్మ జాతరతో లక్షలాది మంది భక్తజనం అత్యంత భక్తి శ్రద్ధలతో గంగమ్మతల్లిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. రోజువారీ వేషధారణలతో భక్తులు సందడితో నగర వీధులు హోరెత్తాయి. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి..గంగమ్మతల్లికి పొంగళ్లు పెట్టి, నైవేద్యం సమర్పించి, కుటుంబ సమేతంగా ప్రణమిల్లి, మొక్కులు చెల్లించుకున్నారు. ఏడు రోజుల పాటు గంగమ్మ నామస్మరణలు, జాతర వేషాల సందడి, డప్పుల ధరవుల మోతతో తిరుపతి హోరెత్తింది. గంగజాతర చివరి రోజైన మంగళవారం అర్ధరాత్రి తర్వాత తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో ప్రత్యేకంగా కొలువుతీరిన గంగమ్మ విశ్వరూప ప్రతిమ దర్శనంతో భక్తులు పులకించారు. భక్తులు భక్తి పారవశ్యంతో గంగమ్మ తల్లీ.. కరుణించి కాపాడు తల్లీ అంటూ అమ్మవారి విశ్వరూపానికి చేతులెత్తి మొక్కి, వేడుకున్నారు. ఈనెల 5వ తేదీన అర్ధరాత్రి చాటింపుతో ఆరంభమైన తిరుపతి గంగజాతర భక్తకోటి మొక్కులతో ప్రతి రోజూ తాతయ్యగుంట గంగమ్మ ఆలయం భక్తులతో కిక్కిరిసింది. ఆలయం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసుల సహకారంతో భక్తులకు పటిష్ట ఏర్పాట్లు చేశారు. ఆలయ ఆవరణలో పోలీసుల సమక్షంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక గ్యాలరీల్లో భక్తులు మంగళవారం అర్ధరాత్రి నుంచే అమ్మవారి విశ్వరూప దర్శనం కోసం ఎదురు చూశారు. అర్ధరాత్రి తర్వాత సంపూర్ణంగా అమ్మవారి విశ్వరూపం కొలువు కాగా అమ్మా... గంగమ్మా... చల్లంగా చూసి కాపాడవమ్మా అంటూ భక్తులు చేతులు జోడించి అమ్మవారిని వేడుకున్నారు. జాతర చివరి రోజు రాత్రి పేరంటాల వేషధారుడు కైకాల కులస్తుడు నగర వీధులు విహరిస్తూ భక్తుల పూజలందుకున్నారు. బుధవారం వేకువ జామున తాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి చేరుకున్న పేరంటాలు గంగమ్మతల్లి విశ్వరూప ప్రతిమ చెంప నరకడంతో జాతర సమాప్తమైంది. దీంతో అత్యంత పవిత్రంగా భావించే గంగమ్మ విశ్వరూప ప్రతిమ బంకమట్టి కోసం భక్తులు ఎగబడ్డారు. అనంతరం పేరంటాలు తాళ్లపాక పెద్ద గంగమ్మ ఆలయానికి చేరుకుని అక్కడ కొలువైన పెద్ద గంగమ్మ విశ్వరూప ప్రతిమ చెంపనరకడంతో జాతర ఘట్టం ముగిసింది.

గంగమ్మ విశ్వరూప దర్శనం కోసం వేచివున్న భక్తజనం

భక్తులను పక్కకు నెడుతున్న పోలీసులు

విశ్వరూప ఘట్టంలో మళ్లీ పునరావృతమైన పేరంటాలు గొడవ

Advertisement
 
Advertisement
Advertisement