● ఉత్తుత్తి జాబ్‌మేళాలతో బాబు సర్కార్ డ్రామా ● నెలలు గడిచినా అభ్యర్థులకు అందని అపాయింట్‌మెంట్ లెటర్స్ ● జాబ్‌మేళాలు కాదు.. ప్రభుత్వ ప్రచార సభలంటున్న యువత ● ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నిరుద్యోగులు, విద్యార్థి సంఘాలు
నిరుద్యోగుల జీవితాలతో ఆటలా..
బాబు సర్కార్ నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతోంది. జిల్లాలో గత రెండేళ్లుగా ప్రతి నియోజక వర్గంలో ప్రైవేటు కంపెనీల ప్రతినిధులతో మెగా జాబ్‌మేళా నిర్వహించింది. ఈ మేళాలో ఒక్కో నియోజకవర్గంలో 10 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని ఆర్బాటంగా యువతను జాబ్‌మేళాలకు తరలించారు. ఎంతో ఆశతో ధృవపత్రాలు చేతపట్టుకుని జాబ్‌మేళాలకు హాజరైన యువతకు నిరాశే మిగిలింది. హాజరైన వారిలో కేవలం 50 శాతం మందికి సైతం ఉద్యోగాలు రాలేదు. ఉద్యోగానికి ఎంపికై న వారికి సరైన నియామకపత్రాలు ఇవ్వలేదు. అపాయింట్‌మెంట్ లెటర్లు అందుకున్న వారికి పదుల సంఖ్యలో షరుతులు పెట్టారు. మూడు నెలల ట్రైనింగ్ ఉంటుందని, ట్రైనింగ్‌లో ప్రతిభ చూపితేనే ఉద్యోగం ఉంటుందని లేనిపక్షంలో తొలగించడం జరుగుతుందని షరతులు పెట్టడంతో నియామకపత్రాలు పొందిన వారు సైతం ఉద్యోగంలో చేరడం లేదు. జాబ్‌మేళాలో ఉద్యోగాలు పొందిన 80శాతం మందికి నెలలు గడుస్తున్నా అపాయింట్‌మెంట్ లెటర్లు అందకపోవడం గమనార్హం
తిరుపతి సిటీ: ఆర్భాటాలు..ప్రగల్భాలు..గారడీ మాటలు వీటికి అంబాసిడర్‌గా గుర్తింపు పొందిన బాబు సర్కార్ యువతను మరోసారి మభ్యపెట్టి చేతులేత్తేసింది. ఎన్నికల హామీల్లో భాగంగా నిరుద్యోగ యువతకు ఎర వేసేందుకు చంద్రబాబు అండ్ కో తాము అధికారంలోకి వస్తానే యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, ఉద్యోగం వచ్చినంత వరకు నిరుద్యోగ భృతి చెల్లిస్తామని హామీలు గుప్పించింది. షరామమూలే..అధికారం చేపట్టి రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ఆ ఊసే ఎత్తకపోగా మరో డ్రామాకు తెరలేపింది. జాబ్‌మేళాల పేరుతో ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలు అంటూ తూతూ మంత్రంగా పబ్లిసిటీ కోసం మేళాలు నిర్వహించి, ఉద్యోగాలు ఇచ్చేశామంటూ చేతులుదులుపుకుంది. ఉద్యోగాలు పొందిన 50 శాతం మందికి నెలలు, సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ అపాయింట్‌మెంట్ లెటర్లు రాకపోవడం గమనార్హం. సర్కార్ వ్యవహార శైలిపై నిరుద్యోగులు, విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ జాబ్‌మేళాలు కాదు. ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాయి.
పబ్లిసిటీ కోసమే..జాబ్‌మేళాలు
మంత్రి, సీఎం సొంత జిల్లా తిరుపతిలోని పలు నియోజకవర్గాల్లో ఇప్పటివరకు జరిగిన జాబ్ మేళాల్లో పాల్గొన్న యువతకు ఇప్పటి వరకు 60 శాతం మందికి ఉద్యోగాలు లభించలేదు. ఉద్యోగాలు పొందిన యువతకు నియామకపత్రాలు చాలా వరకు అందలేదు. యువతను మభ్యపెట్టేందుకు ప్రతి నియోజకవర్గంలో జాబ్‌మేళాలు ఏర్పాటు చేసి రూ.10 లక్షలు, రూ.15 లక్షల ప్యాకేజ్ అంటూ ప్రచారం మొదలు పెట్టారు. కానీ జాబ్‌మేళాలలో పాల్గొన్న కంపెనీలు కేవలం అటెండర్, సెక్యూరిటీ, డెటాఎంట్రీ ఆపరేటర్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, స్టోర్ కీపర్ వంటి పోస్టులకు తూతూ మంత్రంగా ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇప్పటి వరకు జిల్లాలో నిర్వహించిన జాబ్‌మేళాల్లో నెలకు రూ.25వేల జీతంతో ఉద్యోగం పొందిన యువత లేకపోవడం గమనార్హం.
ప్రశంసాపత్రాలతో ఆర్బాటాలు..
జాబ్‌మేళా వేదికలపై ఆడంబరంగా ఇచ్చే ప్రశంసాపత్రాలు ఫొటోలకు పరిమితమైన నియామక లేఖలు నిరుద్యోగి ఇంటికి చేరేసరికి ఆవిరి అవుతున్నాయి. వేదికపై ఎంపిక అయినట్లు ప్రకటించి, నియామకపత్రాలు అందజేసిన తర్వాత కంపెనీల నుంచి ఎలాంటి తదుపరి సమాచారం ఉండడం లేదు. జాబ్‌మేళాలో ఒక జీతం చెప్పి, తీరా విధుల్లో చేరే సమయానికి సగం జీతానికి ఒప్పందాలు మార్చడం సర్వసాధారణమైంది. కేవలం ప్రైవేట్ ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలను పిలిపించి, వాటిని ప్రభుత్వ విజయాలుగా చూపించుకోవడం యువతను మోసం చేయడమేనని విద్యావేత్తలు, విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి.
జిల్లాలో జాబ్‌మేళా వివరాలు
నియోజకవర్గం జాబ్‌మేళాలు హాజరైనవారు ఎంపికై నవారు నియామకపత్రాలు అందుకున్నవారు
తిరుపతి 18 2304 1686 43
చంద్రగిరి 12 4244 3270 51
శ్రీకాళహస్తి 12 3493 2204 48
సత్యవేడు 12 2269 1441 42
కోడూరు 1 277 128 32 శాతం
(జిల్లాలో కలిసిన తర్వాత)
వెంకటగిరి 11 1341 726 36 శాతం
సూళ్లూరుపేట 12 2151 1474 41 శాతం


