ఒక్క అంగుళం భూమిని ఆక్రమించనివ్వను! | - | Sakshi
Sakshi News home page

ఒక్క అంగుళం భూమిని ఆక్రమించనివ్వను!

May 15 2026 12:49 PM | Updated on May 15 2026 12:49 PM

● రెండేళ్ల పాలనలో దౌర్జన్యాలు పెరిగిపోయాయి ● ఎర్రమిట్టలో తులసమ్మని పరామర్శించిన భూమన అభినయ్‌

సాక్షి ప్రతినిధి, తిరుపతి: తాము ఉండగా తిరుపతిలో ఒక్క అంగుళం భూమి కూడా ఆక్రమణకు గురికానివ్వమని వైఎస్సార్‌సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయరెడ్డి స్పష్టం చేశారు. నగరంలోని ఎర్రమిట్టలోని అక్కారంపల్లి సర్వే నంబర్‌ 101/3లో విలువైన భూమిని మూడు రోజుల కిందట కూటమి గూండాలు కొందరు ఆక్రమించుకునేందుకు నానా బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన వైఎస్సార్‌సీపీ పచ్చ మూకల దౌర్జన్యాలను తీవ్రంగా ఖండించింది. ఆ భూమి తమదేనంటున్న బాధితులు తులసమ్మ, మరి కొందరిని భూమన అభినయరెడ్డి, వైఎస్సార్‌సీపీ శ్రేణులు బుధవారం పరామర్శించారు. బాధితురాలు తులసమ్మకు వైఎస్సార్‌ సీపీ తరపున తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో ఆకు రౌడీలు పెరిగిపోయారని, విచ్చలవిడిగా దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. రెండేళ్ల కాలంలో దౌర్జన్యాలు, ఆక్రమణలు పెరిగిపోయాయన్నారు. ఎర్రమిట్టలో వివాదంలో ఉన్న భూమి వివరాలను బాధితురాలిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, కొందరు టీడీపీ నాయకులు కూడా ఎర్రమిట్టలోని ఆక్రమిత భూమిని పరిశీలించారు. బాధితులతో మాట్లాడారు. అండగా ఉంటామని వారికి హామీ ఇచ్చారు.

లాగేసి కొట్టారు..

మా భూమిలోకి మొన్న హఠాత్తుగా 50 మంది ఆడవాళ్లు, మరో 30 మంది మగవారు వచ్చారు. మా ఆధీనంలో ఉన్న భూమిలోకి జేసీబీలు తీసుకొచ్చారు. మా భూమిలోకి ఎందుకు వచ్చారని అడ్డుకున్నాం. వాళ్లు ఏమాత్రం మా మాట వినలేదు. వృద్ధురాలు అని కూడా చూడలేదు. నా మనుమరాలు గర్భవతి ఐనా వినలేదు. లాగి లాగి కొట్టారు. ఏమి జరుగుతుందో అర్థం కాలేదు. మేము వేసుకున్న రేకుల షెడ్డును కూడా కూల్చివేశారు. – తులసమ్మ, బాధితురాలు

Advertisement
 
Advertisement
Advertisement