పన్ను వసూళ్లలో అగ్రగామి | - | Sakshi
Sakshi News home page

పన్ను వసూళ్లలో అగ్రగామి

May 15 2026 12:31 PM | Updated on May 15 2026 12:31 PM

దేశానికే ఆదర్శంగా కాణిపాకం పంచాయతీ రూ.కోట్ల ఆదాయంతో ఆత్మనిర్భర్‌ అవార్డుకు ఎంపిక టోల్‌గేట్లు, సంత, మార్కెట్‌ ఫీజు,డంపింగ్‌ యార్డుతో భారీ ఆదాయం ఆ నిధులతో గ్రామానికి కొత్త రూపం స్వయం సమృద్ధి వైపు దూసుకెళ్తున్న వైనం

కాణిపాకం: కాణిపాకం పంచాయతీలో ఏడు గ్రామాలుండగా 982 కుటుంబాలున్నాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో గ్రామాభివృద్ధికి బీజం పడింది. సచివాలయం, రైతు భరోసా కేంద్రం, సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, కమ్యూనిటీ భవనాలు, రోడ్ల విస్తరణ, వీధి దీపాలు, తాగునీటి ట్యాంకులు, పారిశుద్ధ్య నిర్వహణ వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలతో గ్రామ రూపురేఖలను మార్చింది. స్థానికుల అవసరాలను గుర్తించి, సొంతంగా ఆదాయాన్ని సమకూర్చుకోవడం నేర్చుకుంది. ఆ ఆదాయాన్ని తిరిగి ప్రజాసేవలకే వినియోగించడం మొదలు పెట్టింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో కాణిపాక ప్రధాన ఆలయ జీర్ణోద్ధరణతో కాణిపాకం పంచాయతీ కొత్త కళను సంతరించుకుంది. దీంతోపాటు ఆదాయ వనరుల పెంపునకు దోహదపడింది.

టోల్‌ ఆదాయం దండి

పంచాయతీకి ప్రధాన ఆదాయ వనరు టోల్‌ వసూళ్లు. ఏడాదిలో టోల్‌ వ్యవస్థ ద్వారా ఏకంగా రూ.2.3 కోట్ల మేర ఆదాయం సమారుకుతోంది. అలాగే ప్రతి ఏటా స్థానిక మార్కెట్‌ (వారపు సంత) ద్వారా రూ.5 లక్షలకు పైగా ఆదాయం వస్తోంది. గ్రామానికి వచ్చే వ్యాపారులు, రైతులు, కొనుగోలుదారులతో సంత సాగుతుండడం వల్ల ఆదాయం పెరిగింది. గ్రామ ఆర్థిక వ్యవస్థలో ఈ సంత కీలకపాత్ర పోషిస్తోంది.

ఆర్థిక క్రమశిక్షణ

పంచాయతీ సమీకరించిన ఆదాయాన్ని ప్రజాసదుపాయాల అభివృద్ధికి వినియోగిస్తోంది. గ్రామంలో సీసీ రోడ్లు, అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేసింది. తాగునీటి ట్యాంకుల నిర్మాణం, కమ్యూనిటీ హాళ్లు, వీధి దీపాలు, రోడ్ల విస్తరణ, కాలువల నిర్మాణం వంటి పనులతో గ్రామానికి కొత్త రూపు వచ్చింది. పంచాయతీ ఆదాయ వసూళ్లలో డిజిటల్‌ పర్యవేక్షణ వ్యవస్థలను ప్రవేశపెట్టింది. నగదు పుస్తకాలు, రసీదులు, డిమాండ్‌–వసూలు రిజిస్టర్లు, వోచర్లు, మస్టర్‌ రోల్స్‌ అన్నీ క్రమబద్ధంగా నిర్వహిస్తోంది. పన్ను వసూలు కోసం ప్రత్యేక సిబ్బందిని నియమించింది. అధికారులు క్రమం తప్పకుండా సిబ్బందితో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఆర్థిక క్రమశిక్షణ మరింత బలోపేతమైంది.

తగిన గుర్తింపు

నెల రోజుల క్రితం కేంద్ర బృందం కాణిపాకం గ్రామాన్ని సందర్శించి పంచాయతీ పనితీరును పరిశీలించింది. ఆర్థిక రికార్డులు, ఆదాయ వసూళ్లు, అభివృద్ధి కార్యక్రమాలు, పారిశుద్ధ్య నిర్వహణ, డిజిటల్‌ పర్యవేక్షణ వ్యవస్థలను పరిశీలించి ప్రశంసల వర్షం కురిపించింది. సొంత వనరుల ఆదాయం పెంపు, పారదర్శక పరిపాలన, సమర్థవంతమైన సేవల ఆధారంగా ‘ఆత్మనిర్భర్‌ పంచాయతీ’ ప్రత్యేక పురస్కారానికి కాణిపాకం ఎంపికై ంది.

కమ్యూనిటీ భవనం

వైఎస్సార్‌ సీపీ హయాంలో అభివృద్ధికి బీజం

పారిశుద్ధ్యం..అధిక ప్రాధాన్యం

గ్రామ పారిశుద్ధ్య నిర్వహణలో కాణి పాకం ప్రత్యేక గుర్తింపు పొందింది. డంపింగ్‌యార్డు ద్వారా చెత్తను వేరుచేసి ఎరువుల తయారీ చేపడుతోంది. ఘన వ్యర్థాల నిర్వహణ వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేస్తోంది. చెత్త పన్ను ద్వారా వచ్చిన ఆదాయాన్ని తిరిగి పారిశుద్ధ్య సేవల మెరుగుకు వినియోగిస్తోంది. ప్రతి వీధిలో శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వడం, చెత్త సేకరణకు ప్రత్యేక సిబ్బంది నియామకం, పారిశుద్ధ్య వాహనాల వినియోగం వంటి చర్యలు చేపడుతోంది. డంపింగ్‌, పారిశుద్ధ్య సంబంధిత కార్యక్రమాలకు కాణిపాకం పంచాయతీని ఆదర్శంగా తీసుకుంటూ జిల్లాలోని అధికారులందరికీ ఇక్కడ శిక్షణ ఇప్పిస్తున్నారు.

కాణిపాకం పంచాయతీ పన్ను వసూళ్లలో కూడా ఆదర్శంగా నిలుస్తోంది. ఆస్తి పన్ను రూపంలో ఈ ఏడాది రూ.13,68,640 వసూలు చేసింది. ఇంటింటి సర్వేలు నిర్వహించి ఆస్తుల మ్యాపింగ్‌ చేయడం, డిమాండ్‌–కలెక్షన్‌–బ్యాలెన్స్‌ రిజిస్టర్లను పటిష్టంగా నిర్వహించడం వల్ల వసూళ్లు గణనీయంగా పెరిగాయి. నీటి చార్జీల ద్వారా రూ.3 లక్షలు, పారిశుద్ధ్య పన్ను రూ.1.6 లక్షలు, లైటింగ్‌ పన్ను రూ.80 వేలు, చెత్త పన్ను రూ.88 వేలు వచ్చింది. వీటితో పాటు పలు వనరుల ద్వారా ఆదాయం వస్తోంది. మొత్తంగా పంచాయతీ పన్ను ఆదాయం రూ.2.6 కోట్లు దాటుతోంది. పన్నేతర ఆదాయం రూ.8 లక్షలకు పైగా వస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement