శ్రీకాళహస్తి : జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామిని గురువారం సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే ఐజీ ఆరోమాసింగ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి దక్షిణ గోపురం వద్ద ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లుచేశారు. దర్శనానంతరం మృత్యుంజయస్వామి సన్నిధి వద్ద వేద పండితులు ఆశీర్వదించి స్వామి, అమ్మవార్ల జ్ఞాపిక, తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో పీఆర్వో మహేష్, రాజగోపాల్‌నాయుడు, రైల్వే అధికారులు మాబు సుభాని, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
పీజీఈసెట్ ఫలితాల్లో 93.48 శాతం ఉత్తీర్ణత
– మహిళా అభ్యర్థులదే పైచేయి
తిరుపతి సిటీ: ఆంధ్ర యూనివర్సిటీ ఆధ్వర్యంలో గత నెల 28 నుంచి మూడు రోజులు ఎస్వీయూ పరిధిలో నిర్వహించిన ఏపీ పీజీఈసెట్–2026 ఫలితాలను గురువారం ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఎస్వీయూ పరిధిలో 2,898 మంది పరీక్షలు రాయగా 93.48 శాతంతో 2,709 మంది ఉత్తీర్ణత సాధించారు. అలాగే తిరుపతి జిల్లాలో 804 మంది దరఖాస్తు చేసుకోగా 667 మంది పరీక్ష రాశారు. వారిలో 94 శాతంతో 627 మంది ఉత్తీర్ణులైనట్లు కన్వీనర్ తెలిపారు. ఏపీపీజీఈసెట్ ఫలితాల్లో ఎస్వీయూ పరిధిలో పురుషుల కంటే మహిళా అభ్యర్థులు పైచేయి సాధించారు. వర్సిటీ పరిధిలో 1,582 మంది పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 1,308 మంది పరీక్ష రాశారు. 93.35 శాతంతో 1,221 మంది ఉత్తీర్ణులయ్యారు. అలాగే 1,831 మంది మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 1,590 మంది పరీక్షకు హాజరయ్యారు. వారిలో 93.58 శాతంతో 1,488 మంది ఉత్తీర్ణత సాధించారు.


