తిరుపతి అన్నమయ్య సర్కిల్: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం వచ్చే భక్తులకు తిరుపతిలో విస్తృత స్థాయిలో వసతి, విశ్రాంతి, లాకర్, స్నాన, అన్నప్రసాదం, వైద్య తదితర సౌకర్యాలను అందుబాటులో ఉంచినట్టు టీటీడీ అధికారులు తెలిపారు. శ్రీనివాసం, విష్ణునివాసం, మాధవం, ఎస్వీ గెస్ట్ హౌస్, పద్మావతి గెస్ట్ హౌస్, తిరుచానూరు తోళ్లప్ప గార్డెన్ తదితరాల్లో వసతి సముదాయాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అలాగే డార్మిటరీలు, ఉచిత లాకర్లు, మరుగుదొడ్లు, స్నానపు గదులు, ప్రథమ చికిత్స కేంద్రాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఏసీ గదులను ఆన్‌లైన్, రొటేషన్ విధానంలో భక్తులకు కేటాయిస్తున్నట్టు తెలిపారు. విష్ణునివాసంలో 408 గదులు, 9 హాళ్లు, 706 లాకర్లు ఉన్నాయని తెలి పారు. శ్రీనివాసం కాంప్లెక్స్‌లో 552 గదులు, 9 డార్మిటరీలు, 1038 లాకర్లు ఉన్నాయని, మాధవం గెస్ట్ హౌస్ లో 164 ఏసీ గదులు, డీలక్స్ సూట్లు ఉన్నాయని తెలిపారు. ఎస్వీ గెస్ట్ హౌస్‌లో ఏసీ, నాన్ ఏసీ కలిపి 31 గదులు ఉన్నట్టు వివరించారు. ఆయా కాంప్లెక్స్‌లలో అన్నప్రసాదం పెడుతున్నట్టు తెలిపారు. శ్రీగోవిందరాజ స్వామి సత్రాల స్థానంలో నిర్మిస్తున్న భవనాలు పూర్తయితే మరిన్ని వసతి గదులు, లాకర్లు, డార్మిటరీలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
గదుల కేటాయింపు విధానం...
తిరుపతిలోని విష్ణునివాసంలో పరిమిత సంఖ్యలో గదుల కేటాయింపు కరెంట్ బుకింగ్, తిరుపతిలోని మిగిలిన అన్ని చోట్ల నిబంధనల ప్రకారం వెబ్‌సైట్‌లో భక్తులు ముందస్తుగా బుక్ చేసుకోవాలి. ఒంటరి, అవివాహిత సీ్త్ర, పురుష జంటలకు గదులు కేటాయించరు.


