రైల్వే అండర్‌ బ్రిడ్జి పనులు | - | Sakshi
Sakshi News home page

రైల్వే అండర్‌ బ్రిడ్జి పనులు

May 15 2026 12:31 PM | Updated on May 15 2026 12:31 PM

● అధికారుల సమన్వయ లోపం... ● అండర్‌ డ్రైనేజ్‌ ఊసే లేదు ● ఏమీ చేయకుండానే సన్మానాలా..? ● అసహనం వ్యక్తం చేస్తున్న వాహనదారులు

అసంపూర్తిగా

రేణిగుంట: రేణిగుంట పాత చెక్‌ పోస్టు వద్ద ఉన్న రైల్వే అండర్‌ బ్రిడ్జి మరమ్మతు పనులు పూర్తిస్థాయిలో పూర్తి కాలేదు. అధికారపార్టీ నాయకులు పనులు మొత్తం పూర్తయ్యాయని పేర్కొంటూ సన్మానాలు చేసుకుని వాహనాల రాకపోకలను ప్రారంభించారు. పనులు అసంపూర్తిగా ఉండడాన్ని చూసిన వాహనదారులు ఇదేందిరా స్వామి అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అదనపు రైల్వే ట్రాక్‌ కోసం ఏర్పాటు చేసిన స్లాబ్‌ ఇంకా అసంపూర్తిగా ఉంది. బ్రిడ్జి రెండు కన్నాల్లోని నాలుగు వైపులా పైన పెట్టిన సిమెంట్‌ రాళ్లు అలాగే వదిలేశారు. అవి ఎప్పుడైనా వాహనాలపై పడే ప్రమాదం ఉంది. అంతేగాక మధ్యలో గ్యాప్‌ ఉండడంతో పైనుంచి వస్తువులు పడే పరిస్థితి. అధికారులు హడావిడిగా బ్రిడ్జికి రంగులు వేసి వాహనాల రాకపోకలను ప్రారంభించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వర్షపు నీరు వెళ్లే మార్గమేదీ..?

బ్రిటీష్‌ కాలం నాటి రైల్వే అండర్‌ బ్రిడ్జికి మరమ్మతులు చేసిన అధికారులు అండర్‌ డ్రైనేజ్‌ గురించి పట్టించుకోలేదు. చిన్నపాటి వర్షం కురిసినా మోకాలి లోతు నీరు నిలిచి వాహనాల రాకపోకలకు అంతరా యం ఏర్పడుతోంది. నెల రోజులు బ్రిడ్జిని మూసివేసిన అధికారులు వర్షపు నీరు సక్రమంగా వెళ్లేలా చర్యలు తీసుకోలేదని స్థానికులు మండిపడుతున్నారు.

వదిలేసిన రోడ్డు మరమ్మతు పనులు

రైల్వే అధికారులు బ్రిడ్జి మరమ్మతు పనులు చేసి చేతులు దులుపుకున్నారు. రోడ్డు పనుల గురించి పట్టించుకోలేదు. నెల రోజులు బ్రిడ్జిన మూసివేసిన అధికారులు అన్ని పనులను ఒకేసారి పూర్తి చేసి ఉంటే బాగుండేదని, ఆర్‌ అండ్‌ బీ, పంచాయతీ అధికారుల మధ్య సమన్వయం లోపించడం వల్లే పనులు చేయలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

నిత్యం ప్రమాదాలు జరిగే ప్రదేశం...

అండర్‌ బ్రిడ్జ్‌ సమీపాన ఓల్డ్‌ చెక్‌ పోస్ట్‌ వద్ద ఉన్న సర్కిల్‌ మధ్యలో బారికేడ్లు ఏర్పాటుచేయకపోవడంతో వాహనదారులు రాంగ్‌ రూట్లో వస్తున్నారు. దీంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. బ్రిడ్జి మరమ్మతులు చేసే సమయంలోనే ఆర్‌అండ్‌బీ అధికారులు బారికేడ్లను ఏర్పాటు చేస్తారని అందరూ భావించారు. అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు.

Advertisement
 
Advertisement
Advertisement