తొట్టంబేడు : తొట్టంబేడు మండలం గుమ్మడిగుంట ఎస్టీకాలనీ సమీపంలోని తెలుగు గంగ కాలువలో యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. పట్టణ శివారు జైహింద్‌పురానికి చెందిన శశికుమార్(20) సెప్టిక్ ట్యాంకు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతను మూడు రోజుల క్రితం శ్రీకాళహస్తి వచ్చాడు. జీతంలోని కొంత సొమ్ము తీసుకునేందుకు నాయుడుపేట వద్ద ఉన్న తుమ్మూరులోని తన యజమానిని కలిసి వస్తానని ఆదివారం ఇంట్లో చెప్పాడు. అదే రోజునాయుడుపేటలో జాతర కావడంతో ఉత్సాహంగా పాల్గొన్నాడు. గుమ్మడిగుంట ఎస్టీకాలనీ వద్ద ఉన్న తెలుగుగంగ కాలువలో గుర్తు తెలియని శవం ఉన్నట్లు స్థానికులు బుధవారం రాత్రి తొట్టంబేడు పోలీసులకు సమాచారం అందించారు. వారు గురువారం ఉదయం అక్కడికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీసి శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. శశికుమార్‌గా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ప్రైవేటు కంపెనీ బస్సు బోల్తా
సూళ్లూరుపేట : శ్రీసిటీ సెజ్‌లోని టీవీఎస్ కంపెనీకి కార్మికులను తరలిస్తున్న బస్సు గురువారం తడ సమీపంలోని బోడిలింగాలపాడు శివాలయం వద్ద కల్వర్టును ఢీకొని బోల్తా కొట్టింది. దీంతో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు.. కంపెనీ బస్సు దొరవారిసత్రం నుంచి సుమారు 20 మంది కార్మికులను ఎక్కించుకుని బయలుదేరింది. బోడిలింగాలపాడు శివాలయం వద్ద అదుపుతప్పి కల్వర్టును ఢీకొంది. బస్సులో ఉన్న కార్మికులు ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు అక్కడికిచేరుకుని వారిని సూళ్లూరుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తడ ఎస్‌ఐ కొండపనాయుడు బస్సును పక్కకు తొలగించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
యువకుడికి తీవ్ర గాయాలు
రాపూరు: మండలంలోని గోనుపల్లి వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్రగాయాలైనట్లు పోలీసులు తెలిపారు. ఆర్టీసీ బస్సు రాపూరు నుంచి పెంచలకోనకు వెళుతోందని పేర్కొన్నారు. అదేసమయంలో కలువాయి మండలం ఊయలపల్లికి చెందిన సురేష్ పెంచలకోన నుంచి రాపూరుకు బైక్‌లో వస్తున్నాడని తెలిపారు. గోనుపల్లి మలుపు వద్ద బైక్‌ను బస్సు ఢీకొందని, దీంతో సురేష్‌కు తీవ్రగాయాలైనట్టు పేర్కొన్నారు. అతన్ని 108 సిబ్బంది రాపూరు ప్రభుత్వవైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈఏపీసెట్‌కు
94.64 శాతం హాజరు
తిరుపతి సిటీ: జిల్లాలో మూడు రోజులుగా ఏపీ ఈఏపీసెట్–2026 (ఎంసెట్) ప్రశాంతంగా జరుగుతోందని కన్వీనర్ ఒక ప్రకటనలో తెలిపారు. మూడవ రోజు గురువారం జిల్లాలో ఏర్పాటు చేసిన 5 పరీక్షా కేంద్రాల్లో ఇంజినీరింగ్ స్ట్రీమ్ ప్రవేశ పరీక్షకు 94.64 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారని పేర్కొన్నారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు తొలి సెషన్ పరీక్షకు 981 మందికి గాను 922 మంది, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు జరిగిన పరీక్షకు 1,331 మందికి గాను 1,266 మంది హాజరయ్యారని వెల్లడించారు. శుక్రవారం జరగనున్న పరీక్షకు సుమారు 2 వేల మంది విద్యార్థులు హాజరుకానున్నట్టు తెలిపారు.


