–ఈ ఏడాదిలో ఎమ్మెస్సీ మ్యాథమెటిక్స్ అండ్ మోడలింగ్ కోర్సు
తిరుపతి సిటీ: జాతీయ సంస్కృత వర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరం నుంచి ఎమ్మెస్సీ మ్యాథమెటిక్స్ అండ్ మోడలింగ్ నూతన కోర్సు ప్రారంభించనున్నారు. ఈ మేరకు గురువారం ఎన్‌ఎస్‌యూ గణిత విభాగం బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ కార్యాలయంలో నూతన కోర్సు సిలబస్ రూపకల్పనపై కమిటీ కీలక సమావేశం నిర్వహించారు. ఇందులో తిరుపతి ఐఐటీ, హైదరాబాద్ జేఎన్‌టీయూ, వరంగల్ నిట్, తిరుపతి ఎస్వీయూకు చెందిన విద్యావేత్తలు పాల్గొన్నారు. నూతన కోర్సు పాఠ్యాంశాల ప్రణాళిక, సిలబస్ రూపకల్పనపై చర్చించి ఆమోదం తెలిపారు. వారు మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రమాణాలతో, వైదిక విజ్ఞాన శాస్త్రాల స్ఫూర్తితో రూపొందిన ఎంఎస్సీ ప్రోగ్రామ్ భారతీయ విజ్ఞాన వ్యవస్థను (ఐకేఎస్) ప్రస్తుత విజ్ఞాన వ్యవస్థతో (సీకేఎస్) అనుసంధానం చేస్తుందని తెలిపారు. ప్రధాని ఆకాంక్షించిన వికసిత భారత్ లక్ష్య సాధనలో భాగంగా వినూత్న కోర్సును తీర్చిదిద్దినట్టు పేర్కొన్నారు. మానవాళి అభివృద్ధికి అవసరమైన ఏఐ ఆధారిత మోడలింగ్‌లో విద్యార్థులకు ప్రయోగాత్మక అనుభవాన్ని అందించడం ఈ కోర్సు ప్రధాన ఉద్దేశమన్నారు.
26న ఖాళీ గోనె సంచుల ఈ–వేలం
తిరుపతి అన్నమయ్య సర్కిల్ : తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాల్లో వినియోగించిన ఖాళీ గోనె సంచులను 2026–27 సంవత్సరానికి ఈ నెల 26న ఈ–వేలం ద్వారా విక్రయించనున్నట్టు టీటీడీ తెలిపింది. వేలంలో పాల్గొనదలచిన వారు ఈ నెల 25వ తేదీ మధ్యాహ్నంలోపు ఆన్‌లైన్‌లో రూ.75 వేలు ఈఎండీ చెల్లించాలని పేర్కొంది. వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ కార్యాలయంలో పనివేళల్లో సంప్రదించవచ్చని, అలాగే ఫోన్ 0877–2264429, అలాగే టీటీడీ వెబ్‌సైట్‌ను చూడాలని టీటీడీ వెల్లడించింది.
రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి
తిరుపతి క్రైం : తిరుచానూరు –రేణిగుంట రైల్వే స్టేషన్ల మధ్య కిలోమీటర్ నంబర్ 84 సమీపంలో రేణిగుంట వైపు వెళ్తున్న డెమో ప్యాసింజర్ రైలు కింద పడి వ్యక్తి మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. అతనికి 48 ఏళ్లు ఉంటాయని, తల వెనుక భాగంలో తీవ్ర గాయం ఉన్నట్లు పేర్కొన్నారు. అతని వద్ద గుర్తింపు కార్డులు, ఆధారాలు లభించలేదని తెలిపారు. బ్లూ కలర్ ఫుల్ హ్యాండ్స్ షర్ట్, నశిం కలర్ అడ్డుగీతల గళ్ల లుంగీ, బ్లూ కలర్ ఫుల్ ట్రౌజర్ ధరించి ఉన్నాడని తెలిపారు. నాలుగు పేటల మొలతాడు ఉందన్నారు. మృతదేహాన్ని తిరుపతి ఎస్వీ మెడికల్ కాలేజీ మార్చురీకి తరలించామని వెల్లడించారు. మృతుడిని ఎవరైనా గుర్తుపట్టినట్లయితే తిరుపతి రైల్వే పోలీసులను సంప్రదించాలని తెలిపారు. రైల్వే ఇన్‌స్పెక్టర్ ఎన్.వరప్రసాద్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.


