ఇసుక దోపిడీపై చర్యలేవీ..? | - | Sakshi
Sakshi News home page

ఇసుక దోపిడీపై చర్యలేవీ..?

May 15 2026 12:31 PM | Updated on May 15 2026 12:31 PM

● ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు ● తవ్వకాలతో రూపుకోల్పోయిన స్వర్ణముఖి ● వైఎస్సార్‌ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి చిందేపల్లి మధుసూదన్‌రెడ్డి ఆవేదన

పెళ్లకూరు: స్వర్ణముఖినదిలో భారీ యంత్రాలతో తవ్వకాలు చేపట్టి ఇసుకను లారీలు, ట్రాక్టర్లలో ఇతర ప్రాంతాలకు తరలించడం వల్ల భూగర్భ జలాలు అడుగంటాయని, సాగు నీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వైఎస్సార్‌ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి చిందేపల్లి మధుసూదన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన గురువారం కలవకూరు గ్రామం వద్ద స్వర్ణముఖి నదిలో చేపట్టిన ఇసుక తవ్వకాలను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ నిబంధనల ప్రకారం నదీ ఉపరితలం పైపొరను మూడు అడుగులు మేరకు ఇసుకను కూలీలతో తవ్వకాలు చేపట్టి స్థానిక అవసరాలకు మాత్రమే వినియోగించుకోవాలన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో కూటమి నేతలతో కలిసి కాంట్రాక్టర్‌ స్వర్ణముఖినదిలోని ఇసుకను సొంత ఆదాయ వనరులుగా మార్చేసుకున్నట్లు ఆరోపించారు. స్వర్ణముఖినదిలో ఇచ్చిన డీసిల్టింగ్‌ అనుమతుల మాటున 20 అడుగులకు పైగా తవ్వకాలు చేపట్టారని విమర్శించారు. దీంతో తాగు, సాగునీటికి కష్టాలు ఎదురైనట్లు పేర్కొన్నారు. కూటమి నేతల ఇసుక దోపిడీని అడ్డుకున్న మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డితోపాటు 26 మందిపై అక్రమ కేసులు పెట్టారని తెలిపారు. సత్యనారాయణరెడ్డికి బెయిల్‌ మంజూరు కాకుండా రెండు నెలలకు పైగా జైలులో నిర్భందించి వేధిస్తున్నారని దుయ్యబట్టారు. స్థానిక ఎమ్మెల్యే, నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జ్‌, కొందరు నాయకులు కాంట్రాక్టర్‌తో కలిసి స్వర్ణముఖి నదిలో ఇసుకను దోపిడీ చేస్తున్నా అధికారులు మౌనం వహించడం సిగ్గు చేటన్నారు. 2029లో జగనన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే దోపిడీ దారులకు వడ్డీతో సహా తిరిగి చెల్లించడమే కాకుండా ఇసుక సొమ్మును పూర్తిస్థాయిలో రికవరీ చేయించేలా చర్యలు తీసుకోవడం ఖాయమన్నారు. ఇసుక అక్రమ తవ్వకాలతో ప్రమాదకరంగా మారిన స్వర్ణముఖినది దీనస్థితిపై వివిధ శాఖల అధికారులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఆయన వెంట నాయకులు మణినాయుడు, సునీల్‌, హేమంత్‌నాయుడు, ఆనంద్‌, వెంకటేష్‌, రమణయ్య, శివ తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement