తిరుమల: తిరుమల కొండపై ఆక్రమణల వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. తిరుపతికి చెందిన జనసేన పార్టీ నాయకుడు, ఎమ్మెల్యే అనుచరుడు రాజేష్‌తో పాటు అతని అనుచరులు అనధికారికంగా మూడు తట్టలు (హ్యాకర్లు) ఏర్పాటు చేయడం వివాదాస్పదంగా మారింది. అడ్డుకునేందుకు ప్రయత్నించిన రెవెన్యూ అధికారులను బెదిరించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై భక్తులు, స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జనసేన నాయకులు, తిరుపతి ఎమ్మెల్యే అనుమతితోనే నిర్మాణాలు చేపట్టాం అంటూ అధికారుల ముందే బహిరంగంగా చెప్పినట్లు తెలిసింది. దీంతో ఈ వ్యవహారం రాజకీయ రంగు దాల్చింది. అధికార పార్టీ మద్దతుతోనే ఈ ఆక్రమణలు జరుగుతున్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా విజిలెన్స్ అధికారులు ప్రేక్షక పాత్ర పోషించిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తిరుమలలోని పలు శాఖలు రాజకీయ నాయకులతో కుమ్మక్కయ్యాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెవెన్యూ అధికారులు చర్యలకు దిగినా, విజిలెన్స్ అధికారులు ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోలేదని స్థానికులు మండిపడుతున్నారు. అలాగే గతంలో వివాదాస్పదంగా మారిన 151 తటాల లైసెన్సుల అంశాన్ని కూడా స్థానికులు ప్రస్తావిస్తున్నారు. అప్పట్లో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లే ఇప్పుడు తిరుమలలో అక్రమ తట్టల వ్యవహారం మరింత పెరిగిందని ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం, టీటీడీ అధికారులు స్పష్టమైన విధానం ప్రకటించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఘటన ఉద్రిక్తంగా మారడంతో చివరకు అధికారులు రంగంలోకి దిగినట్లు సమాచారం. అనధికారికంగా ఏర్పాటు చేసిన తట్టలను తొలగించినట్లు తెలిసింది. అయినప్పటికీ పవిత్ర తిరుమల కొండపై రాజకీయ జోక్యాలు, అక్రమ నిర్మాణాలు కొనసాగుతుండడం భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘‘తిరుమల పవిత్రతను కాపాడాలి.. రాజకీయాలకు వేదిక చేయొద్దు’’ అంటూ భక్తులు ప్రభుత్వాన్ని, టీటీడీ అధికారులను కోరుతున్నారు.


